Hyderabad: హైదరాబాదీలకు మరో శుభవార్త.. 'మోనో' రైలు మార్గానికి ప్రభుత్వం నిర్ణయం!
- తొలి దశలో మియాపూర్ నుంచి గచ్చిబౌలి మీదుగా 15 కిలోమీటర్ల మార్గం
- సలహా కోసం నోడల్ ఏజెన్సీ ఏర్పాటు
- ప్రపంచవ్యాప్తంగా మోనో రైళ్లకు విశేష ఆదరణ
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరవాసుల కష్టాలు తీర్చే మెట్రో రైలు ఇప్పటికే కొన్ని రూట్లలో పరుగులు పెడుతుండగా అతి త్వరలోనే మోనో రైలు మార్గాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తొలి దశలో మియాపూర్, శిల్పారామం, గచ్చిబౌలి మీదుగా 15 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన ఈ మోనో రైలు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)ని సలహా సంస్థగా నియమించింది.
మోనో రైళ్ల వల్ల చాలా అనుకూలతలు వున్నాయి. ఈ రైలు మార్గాన్ని ఒకేఒక స్తంభం (పిల్లర్)పై నిర్మిస్తారు. దీనికి పట్టాలు (ట్రాక్స్) అక్కర్లేదు. పిల్లర్ల పైన రైలు ప్రయాణిస్తుంది. దీంతో ఇతర రైళ్లలా కాకుండా దీనిని తక్కువ విస్తీర్ణంలో నిర్మించడానికి వీలవుతుంది. హైదరాబాదు వంటి రద్దీ బాగా వుండే నగరాలకు ఇవి చాలా అనుకూలం.
ప్రపంచవ్యాప్తంగా మోనో రైళ్లకు మంచి ఆదరణ లభిస్తుండడంతో హైదరాబాద్‌లోనూ ఆదరణ లభిస్తుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది. హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన శిల్పారామం, గచ్చిబౌలి, మియాపూర్ మార్గాన్ని ఇందుకోసం ఎంచుకుంది. ఈ మార్గంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ అంతర్జాతీయ ఐటీ సంస్థలు ఉండడంతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటోంది. ట్రాఫిక్ జామ్‌లతో తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనిని నివారించేందుకే ప్రభుత్వం మోనో రైలుపై దృష్టి సారించింది.