rcom: వారంలోనే రెండింతలైన ఆర్ కామ్ షేరు... జాగ్రత్త అంటున్న విశ్లేషకులు
- నవంబర్ 15న ధర రూ.9.60
- ఈ నెల 22 నాటి ధర రూ.16.38
- ప్రస్తుత ధర రూ.33
- ర్యాలీలో అమ్ముకోవడం మంచిదంటున్న విశ్లేషకులు
రిలయన్స్ కమ్యూనికేషన్స్ షేరు గత నెల రోజులుగా స్టాక్ మార్కెట్లో పరుగులు తీస్తోంది. ఎందుకని? ఈ ప్రశ్న ఇన్వెస్టర్లకు కచ్చితంగా ఎదురవుతుంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ అన్నది అనిల్ అంబానీ గ్రూపులో భాగమైన ఒక కంపెనీ. 15 ఏళ్ల పాటు సెల్యులర్ సేవలు అందించిన ఈ సంస్థ గత నెలలోనే దుకాణం మూసేసింది. కారణం అప్పులు రూ.45,000 కోట్లకు పెరిగిపోయాయి. టెలికం నిర్వహణపై ఏటా వేలాది కోట్ల రూపాయల నష్టాలు వస్తున్నాయి. దీంతో ఆ నష్టాలకు బ్రేక్ వేసేందుకు సేవలు నిలిపివేసింది కంపెనీ.
ఇక, రుణాలు తీర్చలేక దివాళా చర్యలకు వెళ్లాల్సి వస్తుందన్న అంచనాలతో షేర్లకు అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ఈ ఏడాది నవంబర్ 15న ఆర్ కామ్ షేరు రూ.9.60కు క్షీణించింది. ఇది 52 వారాల కనిష్ఠ స్థాయి. ఈ రోజు రూ.33.36 వద్ద ట్రేడవుతోంది. గత వారం రోజుల్లోనే ఇది రెట్టింపైంది. ఈ నెల 22న రూ.16.38 వద్ద ఉందీ షేరు. ఆస్తులు అమ్మి అప్పులు తీర్చనున్నట్టు అనిల్ అంబానీ చేసిన ప్రకటనే దీని పరుగుల వెనుక కారణం.
అయితే, ఈ తరుణంలో విశ్లేషకులు ఏం సూచిస్తున్నారంటే, కంపెనీ రుణ భారం కారణంగా ఇటీవలి కాలంలో ఈ షేరు ధర బాగా తగ్గినందున, తిరిగి రకవరీ అవుతోందని, సమీప కాలంలో మరికొంత పెరగొచ్చని అంటున్నారు. కంపెనీ ఆర్థిక మూలాలు సరిగా లేనందున పెరిగిన ఈ స్థాయిలో తమ దగ్గరున్న షేర్లను విక్రయించేసి బయటపడడం మంచిదని సూచిస్తున్నారు.