women murder: ముస్లిం మతంలోకి మారలేదని హిందూ కోడలిపై హత్యాచారం!
- ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న హిందూ యువతి
- మతం మారాలంటూ మామ, బంధువుల ఒత్తిడి
- నిరాకరించడంలో అత్యాచారం, హత్య
సభ్యసమాజం తలదించుకునే ఘటన జార్ఖండ్ లో చోటు చేసుకుంది. ఇస్లాం మతం స్వీకరించేందుకు నిరాకరించిన ఓ హిందూ యువతిపై ఆమె మామ, బంధువు అత్యాచారం చేసి, హతమార్చారు. దాదాపు నెల రోజుల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే, హిందూ మతానికి చెందిన యువతి తన తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ఆదిల్ అనే ముస్లిం యువకుడిని గత నెలలో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత బొకారోలోని తన అంకుల్ ఇంటికి భార్యతో కలసి ఆదిల్ వెళ్లాడు. అనంతరం, ఆదిల్ తండ్రికి ఆయన సమాచారం అందించాడు. బొకారోకు ఆదిల్ తండ్రి చేరుకున్న తర్వాత... హిందూ మతస్తురాలైన సదరు యువతిని ఇస్లాం మతం స్వీకరించాలంటూ వారు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మతం మారడానికి ఆమె ససేమిరా అంది.
ఈ నేపథ్యంలో, ఇద్దరూ కలసి రాంచీలో ఉండేలా చూస్తామని వారిద్దరికీ ఆదిల్ తండ్రి, అంకుల్ చెప్పారు. అనంతరం రైల్వే స్టేషన్ కు వెళదామంటూ నమ్మబలికి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేశారు. చెట్ల పొదల్లో శవాన్ని పడేశారు. నవంబర్ 6 నుంచి కనిపించకుండా పోయిన సదరు యువతి మృత దేహాన్ని గర్నా నది ఒడ్డున కనుగొన్నారు. పోస్ట్ మార్టంలో ఆమెపై అత్యాచారం జరిగిందనే విషయం వెల్లడైంది.
ఈ నేపథ్యంలో ఆదిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఆదిల్ మాట్లాడుతూ, ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు తాను యత్నించానని, తనను చెట్టుకు కట్టేశారని చెప్పాడు. ఈ ఘటనపై హిందూ సంస్థలు భగ్గుమన్నాయి. ఇది ముమ్మాటికీ లవ్ జీహాదే అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, ఈ దారుణంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.