Vijayawada: పాలకవర్గంలో విభేదాలు.. నూజివీడు వైసీపీ కౌన్సిలర్లు ఆరుగురు రాజీనామా!
- నూజివీడు మునిసిపాలిటీ పాలకవర్గంలో తలెత్తిన విభేదాలు
- ఒప్పందం మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ గా ముగిసిన రేవతి పదవీకాలం
- అయినా తప్పుకోనంటున్న వైనం.. వైసీపీలో మరో వర్గం ఆందోళన
కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన వైసీపీ కౌన్సిలర్లు ఆరుగురు రాజీనామా చేశారు. మునిసిపాలిటీ పాలకవర్గంలో నెలకొన్న విభేదాల కారణంగా ఆ ఆరుగురు కౌన్సిలర్లు రాజీనామా చేశారు. కాగా, ఈ మునిసిపాలిటీ పరిధిలో మొత్తం వార్డుల సంఖ్య 30. ఇందులో 22 స్థానాల్లో వైసీపీ, టీడీపీ 8 స్థానాలను దక్కించుకుంది. అయితే, మునిసిపాలిటి చైర్ పర్సన్ పదవి కోసం వైసీపీ నాయకురాళ్లు బసవా రేవతి, రామిశెట్టి త్రివేణి పోటీపడి రెండు వర్గాలుగా విడిపోయారు.
ఈ నేపథ్యంలో పెద్దల సమక్షంలో రేవతి, త్రివేణి ఒక్కొక్కరు రెండున్నరేళ్ల చొప్పున ఆ పదవిలో ఉండేలా ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం మేరకు తొలుత రేవత ఆ పదవి బాధ్యతలు చేపట్టారు. ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు ముగిసినప్పటికీ రేవతి ఆ పదవి నుంచి తప్పుకోననడంతో గొడవ మొదలైంది. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన త్రివేణి వర్గానికి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించే దిశగా వైసీపీ నేతలు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది.