Kaushik Basu: పెద్ద నోట్ల రద్దు తీవ్ర తప్పిదమే.. అలా చేసి ఉండాల్సింది కాదు: కౌశిక్ బసు
- పెద్ద నోట్ల ప్రభావం ఇంకా ఉంది
- సామాన్యులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు
- జీఎస్టీ అమలు తీరుపై అసంతృప్తి
పెద్ద నోట్లను రద్దు చేసి కేంద్రం తీవ్ర తప్పిదం చేసిందని అంతర్జాతీయ ఆర్థిక సంఘం ఉపాధ్యక్షుడు కౌశిక్ బసు ఆక్షేపించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న భారతీయ ఆర్థిక సంఘం (ఐఈఏ) శతవార్షిక సదస్సు రెండో రోజు ఆయన మాట్లాడుతూ.. నోట్ల రద్దు ప్రభావంతో సామాన్యులు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ఉగ్రవాదుల కారణంగా మార్కెట్లోకి వచ్చే నకిలీ నోట్ల ఏరివేతకు చర్యలు తీసుకోవాలే తప్ప ఇలా ఏకమొత్తంగా నోట్లను రద్దు చేయడం తప్పుడు నిర్ణయమని అన్నారు.
జీఎస్టీపై మాట్లాడుతూ దాని అమలు తీరు తనను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. 2003లో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో దేశ వృద్ధి రేటు మెరుగుపడిందన్నారు. మన దేశానికి ఆంగ్లంపై మంచి పట్టు ఉండడంతో నాణ్యమైన విద్యతో విదేశీ విద్యార్థులను ఆకర్షించే అవకాశం ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుదురుకోవాలని, దానిని పటిష్ఠ పరిచేందుకు కచ్చితమైన చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే ‘ఫెడ్’ ద్వారా అమెరికా ప్రభుత్వం లిక్విడిటీని పెంచే ప్రయత్నం చేస్తోందని, దీనివల్ల వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందని కౌశిక్ బసు హెచ్చరించారు.