Tirumala: దైవ దర్శనానికి వెళ్లి అష్టకష్టాలు పడుతున్న భక్త కోటి!
- తిరుమలలో భక్తులను వణికిస్తున్న చలి
- క్యూలైన్లలో ఇబ్బందులు పడుతున్న భక్తులు
- ఆరుబయటే 30 వేల మంది పడిగాపులు
- ఈ ఉదయం మొదలైన సర్వదర్శనం
వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు తిరుమలకు వెళ్లి దేవదేవుని దర్శించుకుందామని వేచిచూస్తున్న సుమారు లక్ష మందికి పైగా భక్తులు క్యూ లైన్లలో నానా కష్టాలూ పడుతున్నారు. దాదాపు 24 గంటలకు పైగా భక్తులు క్యూ లైన్లలో నిరీక్షిస్తుండగా, చలి తీవ్రత వారిని నానా ఇబ్బందులూ పెట్టింది. క్యూ లైన్లలోని భక్తుల కన్నా, బయట ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు, క్యూ లైన్లలో వేచి ఉన్నవారు మరింత ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పిల్లలతో వచ్చిన వారు చలికి తాళలేకపోయారు. అద్దె గదులు దొరికే పరిస్థితి లేకపోవడంతో, రోడ్లపై సుమారు 30 వేల మంది పడిగాపులుగాస్తున్నారు.
కేవలం వీఐపీలకు పెద్దపీట వేసిన టీటీడీ అధికారులు సామాన్యులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం వీఐపీలకు దర్శనాలను ముగించి, సామాన్య భక్తులను వైకుఠ ద్వారం ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు. అంతకుముందు రాత్రి 11 గంటలకే ఏకాంత సేవను ముగించి, ఆపై అర్ధరాత్రి 12.0కు ఆలయాన్ని తిరిగి తెరిచారు. తిరుప్పావై ప్రవచనాలను ఏకాంతంగా నివేదించిన తరువాత, అభిషేకం సైతం ఏకాంతంగానే జరిగింది. ఆ తరువాత ప్రొటోకాల్ వీఐపీ దర్శనం మొదలైంది. రేపు అర్ధరాత్రి వరకూ స్వామివారు విరామం లేకుండా భక్తులకు దర్శనం ఇవ్వనుండగా, సుమారు 1.5 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకుంటారని అంచనా.