urinate: బహిరంగ మూత్ర విసర్జనను కట్టడి చేయడానికి జీహెచ్ఎంసీ కొత్త పంథా!
- 'లాఠీ సీఠీ' పేరుతో స్వచ్ఛ్ వర్కర్ల గస్తీ
- మూత్రం పోసే వాళ్లకు స్వచ్ఛత గురించి అర్థమయ్యేలా వివరణ
- మూత్రశాల దారి కూడా చూపించనున్న సిబ్బంది
రోడ్ల పక్కన, పబ్లిక్ ప్రాంతాల్లో మూత్ర విసర్జన చేయడాన్ని అరికట్టడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) కొత్త పంథాను ఎంచుకుంది. ఇందులో భాగంగా 'లాఠీ సీఠీ' పేరుతో ఓ స్వచ్ఛ వర్కర్ల సేనను తయారుచేసింది. వీరంతా ఒక విజిల్, లాఠీ కర్ర పట్టుకుని రోడ్ల పక్కన మూత్ర విసర్జన చేసేవారిని చెదరగొడతారు. అంతేకాకుండా దగ్గరలో మూత్రశాల ఎక్కడుందో కూడా చూపిస్తారు.
అయితే ఈ విధానం గురించి పెద్దగా ప్రచారం చేయకపోవడంతో కొన్ని చోట్ల సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజేంద్రనగర్ సర్కిల్లో మూత్రం పోస్తుండగా ఆపినందుకు ఓ క్యాబ్ డ్రైవర్ ఆంజనేయులు అనే జీహెచ్ఎంసీ స్వచ్ఛ వర్కర్ మీద భౌతికదాడి చేశాడు. దీనికి సంబంధించి పోలీసు స్టేషన్ ఫిర్యాదు కూడా నమోదు చేశారు.
గతంలో కూడా బహిరంగ మూత్రవిసర్జనను అరికట్టడానికి జీహెచ్ఎంసీ 'గాంధీగిరి' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా మూత్ర విసర్జన చేసినవారి మెడలో పూలదండలు వేసేవారు. జీహెచ్ఎంసీ చట్టాల ప్రకారం బహిరంగ మల, మూత్ర విసర్జనలు చేసేవారికి దాదాపు రూ. 200 వరకు అధికారులు జరిమానా విధించవచ్చు. గతేడాది దాదాపు 19,260 మంది మీద ఈ రకమైన జరిమానా విధించినట్లు సమాచారం.