vice president: నకిలీ ప్రకటన కారణంగా మోసపోయిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు!
- రాజ్యసభలో వెల్లడించిన చైర్మన్
- నకిలీ వాణిజ్య ప్రకటనల చర్చలో భాగంగా ప్రస్తావన
- వీటిని కట్టడి చేయాలని వ్యాఖ్య
బరువు తగ్గాలంటే ఇది వాడండి.. ఇంత డబ్బులు కట్టండి.. అంటూ వచ్చే ప్రకటనల ద్వారా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా మోసపోయారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా రాజ్యసభలో వెల్లడించారు. సమావేశంలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ తప్పుదోవ పట్టిస్తున్న నకిలీ ప్రకటనల అంశాన్ని చర్చకు లేవనెత్తారు. ఈ అంశం చర్చలో భాగంగా రాజ్యసభ చైర్మన్ కలగజేసుకుని తనకు జరిగిన సంఘటనను పంచుకున్నారు.
"ఇటీవల ఉపరాష్ట్రపతి పదవిలో చేరిన తర్వాత, బరువు తగ్గాలంటే తమ మందులు వాడాలంటూ వచ్చిన ఓ ప్రకటన చూశాను. వారిని సంప్రదిస్తే వెయ్యి రూపాయలు చెల్లించమన్నారు. అలాగే అని చెల్లించాను. తర్వాత మళ్లీ వారి నుంచి ఓ మెయిల్ వచ్చింది. మొదటి మందుతో పాటు మరో టాబ్లెట్ కూడా వాడాలని, దానికి మరో వెయ్యి చెల్లించాలని, అలా చెల్లిస్తేనే మొదటి మందుతో పాటు రెండో మందు కూడా పంపుతామని పేర్కొన్నారు.
దాంతో నాకు అనుమానం వచ్చి వినియోగదారుల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కి ఫిర్యాదు చేశాను. ఆయన విచారించి ఆ ప్రకటన నకిలీదని, అది ఇచ్చిన కంపెనీ అమెరికాకు చెందినదని చెప్పారు' అని వెంకయ్య నాయుడు వివరించారు. ఇలాంటి ప్రకటనలపై ఏదైనా చర్య తీసుకోవాలని ఆయన వ్యాఖ్యానించగా... సభలో ఉన్న పాశ్వాన్.. అందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.