stocks: 2017లో సిరులు కురిపించిన షేర్లు!
- 450 షేర్లు 100 శాతం కంటే ఎక్కువే పెరిగాయి
- హెచ్ఈజీలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.13.8 లక్షలు
- ఇన్వెస్టర్లకు సిరులు పంచిన షేర్లు ఎన్నో
స్టాక్ మార్కెట్ సామాన్యులకు పెద్ద మిథ్యలా అనిపిస్తుంది. కళ్ల ముందే కొన్ని షేర్లు రాకెట్ స్పీడ్ తో పెరిగిపోతుంటే, మరికొన్ని కుప్పకూలిన రాకెట్ ను తలపిస్తాయి. 2017 సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్లు, అంతర్జాతీయ మార్కెట్ల బాటలోనే మంచి వృద్ధిని కనబరిచాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బాగా పెరిగి, ఆ స్టాక్స్ తోనే కొనసాగిన ఇన్వెస్టర్లకు సిరులు కురిపించిన షేర్లు ఇవే...
గతేడాది అంటే 2016 డిసెంబర్ మాసంలో 30వ తేదీ చివరి ట్రేడింగ్ దినం. ఆ రోజు క్లోజింగ్ ధర నుంచి తాజాగా మార్కెట్ ధర ప్రకారం పరిశీలించి చూస్తే... హెచ్ఈజీ అనే షేరు రూ.150 నుంచి రూ.2,221కు చేరింది. అంటే ఒక్క ఏడాది కాలంలోనే ఇది 1381 శాతం పెరిగింది. నాడు రూ.లక్ష పెట్టి హెచ్ఈజీ షేర్లు కొని ఉంటే, వారి షేర్ల విలువ నేడు 13.81 లక్షలు అయి ఉండేవి.
ఇండియాబుల్స్ వెంచర్స్ రూ.20.55 నుంచి రూ.263 (1180 శాతం)కు, సోరిల్ హోల్డింగ్స్ రూ.20.25 నుంచి రూ.226.80 (1020 శాతం)కు, గ్రాఫైట్ ఇండియా రూ.73 నుంచి రూ.678కి, వీజ్ మన్ రూ.172 నుంచి రూ.1,432కు, భన్సాలీ ఇంజనీరింగ్ రూ.22.35 నుంచి రూ.186కు, గోవా కార్బన్ రూ.106 నుంచి రూ.865కు, యుకెన్ ఇండియా రూ.422 నుంచి రూ.3,408కు, ఫ్రాంటియర్ స్ప్రింగ్స్ రూ.31 నుంచి రూ.236కు, గోల్డ్ స్టోన్ ఇన్ ఫ్రా రూ.27 నుంచి రూ.201కు పెరిగాయి. బీఎస్ఈ లో మొత్తం మీద 450 షేర్లు 2017లో 100 శాతం కంటే ఎక్కువే రాబడులు ఇచ్చాయి.