Mumbai: మత్తు-సెల్ఫీ-నిర్లక్ష్యం.. ముంబై దారుణానికి కారణాలు ఇవే!
- మంటలు చుట్టుముడుతుంటే సెల్ఫీలు తీసుకోవడంలో బిజీ
- బయటకు వచ్చే మార్గం లేక మంటలకు ఆహుతి
- కస్టమర్లను వదిలేసి పబ్ సిబ్బంది పరుగో పరుగు
ముంబైలోని కమలా మిల్స్ కాంపౌండ్‌లో గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన విషాదం వెనక ఉన్న కారణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. పుట్టిన రోజు పార్టీ చేసుకోవడానికి స్నేహితులతో కలిసి పబ్‌కు వచ్చిన ఖుష్బూ బన్సాలీ బర్త్ డే కేక్ కట్ చేసిన కాసేపటికే మృతి చెందింది. వెదురు కర్రలతో నిర్మించిన టెర్రస్ కావడంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. మంటల నుంచి రక్షించుకునేందుకు వాష్ రూమ్‌లో దూరిన 15 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన జరిగిన సమయంలో పబ్‌లో 150 మంది ఉన్నారు.
ప్రమాదంలో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోవడానికి మత్తు, సెల్ఫీలు, నిర్లక్ష్యమే కారణమని చెబుతున్నారు. మంటలు వ్యాపించే సమయానికి మత్తులో జోగుతున్న వారంతా వెంటనే స్పందించలేకపోయారు. సృహలో ఉన్నవారు ఇరుకుగా ఉన్న గుమ్మం నుంచి బయటపడి మంటలతో సెల్ఫీలు దిగడంలో మునిగిపోయారు. దీంతో అక్కడ జనాలు పోగయ్యారు. ఫలితంగా బయటకు వచ్చే వారికి దారి కరువైంది. క్షణాల్లో వ్యాపించిన మంటలు అక్కడున్న వారిని చుట్టుముట్టేశాయి. ఇక ప్రమాదం సమయంలో కస్టమర్లను కాపాడాల్సిన పబ్ సిబ్బంది.. ఏమీ పట్టనట్టు పారిపోయి వారి ప్రాణాలను రక్షించుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. కాగా, ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. అగ్నిప్రమాదం జరిగి 15 మంది చనిపోవడంపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.