Pawan Kalyan: 2019లో పవన్ సీఎం కాలేరు.. బాలయ్యతో పోటీ పడితే ఓటమి తప్పదు!: జ్యోతిష్కుడు వేణుస్వామి
- పవన్ ది ఉత్తరాషాఢ నక్షత్రం
- రెండోసారి ఏలినాటి శని ఉంది
- ఎమ్మెల్యే, మంత్రి మాత్రమే కాగలరు
పవన్ కల్యాణ్ రాజకీయ భవితవ్యంపై జ్యోతిష్కుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ9 ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పవన్ జన్మదినం ప్రకారం 2019లో ఆయన ఏపీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఏమాత్రం లేవని చెప్పారు. హిందూపురం నియోజకవర్గం నుంచి బాలకృష్ణపై పవన్ పోటీ చేయకపోవడమే మంచిదని సూచించారు. పోటీ చేస్తే బాలయ్య చేతిలో పవన్ ఓడిపోతారని చెప్పారు.
1971 సెప్టెంబర్ 2న ఉత్తరాషాఢ నక్షత్రంలో పవన్ కల్యాణ్ జన్మించారని... వ్యయంలో సూర్యుడు, శని, బుధుడు కనిపిస్తున్నారని వేణు స్వామి తెలిపారు. మంచి నిర్ణయాలను తీసుకునే పరిపక్వతను బుధుడు ఇస్తాడని, శుక్రుడు కుటుంబ సమస్యలను చూపిస్తాడని తెలిపారు.
బుధుడి కారణంగా పవన్ లో ప్రత్యేకమైన మెంటాల్టీ ఉంటుందని, అయితే ఆ మెంటాల్టీ ఇతరులతో పొసగదని చెప్పారు. ఆయన చుట్టూ ఒక్కరు లేదా ముగ్గురుకి మించి ఉండరని తెలిపారు. ఉత్తరాషాఢ నక్షత్రంలో రెండో సారి ఏలినాటి శని ఉందని... రెండోసారి ఇది ఉన్నవారు ఎమ్మెల్యే, మంత్రి మాత్రమే కాగలుగుతారని, సీఎం అయ్యే అవకాశం లేదని చెప్పారు. 2019లో పవన్ ఎట్టి పరిస్థితుల్లో సీఎం కాలేరని కుండబద్దలు కొట్టారు.
అనంతపురం నుంచి కానీ, హిందూపురం నుంచి కానీ పవన్ కల్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారని... ఒకవేళ హిందూపురం నుంచి పవన్ పోటీ చేస్తే ఓటమి తప్పదని వేణు స్వామి చెప్పారు. బాలయ్యది మూలా నక్షత్రం, పవన్ ది ఉత్తరాషాఢ నక్షత్రమని... ఈ కాంబినేషన్ ను పరిగణనలోకి తీసుకుంటే... నూటికి నూరు పాళ్లు బాలయ్యపై పవన్ పోటీకి వెళ్లే అవకాశం కూడా లేదని తెలిపారు. తాను కేవలం బాలయ్యతో పోటీ గురించే మాట్లాడుతున్నానని స్పష్టతనిచ్చారు. మరోవైపు, వేణు స్వామి వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు మండిపడ్డారు.