roja: విశాఖలో ఒక మహిళ దుస్తులు లాగేసినా చంద్రబాబు పట్టించుకోలేదు: రోజా
- అరాచక పాలన సాగుతోంది
- మహిళలకు రక్షణ లేకుండా పోయింది
- వైయస్ చేసిన వాటిలో బాబు 1 శాతం కూడా చేయలేదు
2017 నారావారి నరకాసుర సంవత్సరమని వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలన మొత్తం అరాచకాలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, అబద్ధాలతో సాగుతోందని ఆమె ఆరోపించారు. చంద్రబాబు పాలనలో క్యాలెండర్లు మారాయే కానీ, మహిళల తలరాతలు మాత్రం మారలేదని అన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించవద్దని ఆదేశించిన ప్రభుత్వం... 31వ తేదీన తెల్లవారుజాము ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతించిందని మండిపడ్డారు. బాబు హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. విశాఖపట్నం పెందుర్తిలో ఓ మహిళను టీడీపీ నేతలు వివస్త్రను చేసి కొట్టారని, అయినా చంద్రబాబు స్పందించలేదని విమర్శించారు.
రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మహిళల కోసం ఎన్నో మంచి పనులు చేశారని... సబితకు హోంమంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఐదుగురు మహిళలను మంత్రులు చేశారని రోజా చెప్పారు. ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ, ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి పథకాలతో మహిళలకు అండగా నిలబడ్డారని అన్నారు. వైయస్ చేసిన వాటిలో చంద్రబాబు ఒక్క శాతం కూడా చేయలేదని విమర్శించారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్ కుమార్తెకు కూడా అన్యాయం జరిగిందంటే... టీడీపీ పాలనలో మహిళల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని అన్నారు. తాము తయారు చేసే మేనిఫెస్టోను చంద్రబాబు ధైర్యంగా చూడగలరా? అంటూ ఎద్దేవా చేశారు.