nannapaneni: నన్నపనేనికి దమ్ము, ధైర్యం ఉంటే నాతో చర్చించాలి.. కన్నీరు పెట్టుకుంటూ డ్రామాలాడుతోంది: సుంకర పద్మశ్రీ ఆగ్రహం
- పత్రికా సమావేశంలో నన్నపనేని రాజకుమారిని ప్రశ్నించాను
- ఆమెను మేము ఎంతో గౌరవిస్తాం, అక్కా అని పిలుస్తాం
- సమాధానం చెప్పకుండా సవాలు విసిరివెళ్లిపోయింది
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్శన్ నన్నపనేని రాజకుమారి, ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మధ్య వివాదం చెలరేగుతోన్న విషయం తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో యూత్ కల్చరల్ క్లబ్ వార్షికోత్సవ వేడుకల్లో అశ్లీల నృత్యాలు చేయించారని సుంకర పద్మశ్రీ నిన్న వీడియోలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఈ నృత్యాల వ్యవహారంపై నన్నపనేని రాజకుమారి స్పందించాలని, ఎక్కడైనా ఏమైనా జరిగితే అక్కడికి వెళ్లి నన్నపనేని రాజకుమారి మొసలి కన్నీరు కార్చుతున్నారని ఎద్దేవా చేశారు. ఆమె నాటకాలు ఆడుతోందని నటులను మించిపోయారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో సుంకర పద్మశ్రీ వ్యాఖ్యలపై నన్నపనేని రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అప్పట్లో కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో.. ఇప్పటి ప్రభుత్వం మహిళలకు ఏం చేస్తుందో తేల్చుకుందామా? అంటూ సవాల్ విసిరారు. దీంతో ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ సుంకర పద్మశ్రీ.. మరోసారి నన్నపనేని రాజకుమారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆమె చేసిన సవాలుని స్వీకరిస్తున్నానని, సవాల్ విసిరిన నన్నపనేనికి దమ్ము, ధైర్యం ఉంటే తనతో చర్చించాలని అన్నారు.
'నేను ఆరోపణలు చేయడమే కాదు సాక్ష్యాలతో పాటు వాస్తవాలు తెలిపాను. పత్రికా సమావేశంలో నన్నపనేని రాజకుమారిని ప్రశ్నించాను. ప్రజాప్రతినిధులు యువజన సమ్మేళనం పేరుతో యువతులతో అసభ్యకరంగా డ్యాన్సులు చేయించారు. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ నేతలు క్షమాపణలు చెప్పాలి. నన్నపనేని రాజకుమారి మేము కోరిన విషయానికి సమాధానం చెప్పుకుండా ఓ సవాల్ విసిరిపోయారు.
ఆమెను మేము ఎంతో గౌరవిస్తాం, అక్కా అని పిలుస్తాం. ప్రభుత్వ నేతలే ఇటువంటి ఘటనలకు పాల్పడుతోంటే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించాను. కానీ, ఆమె అందుకు సమాధానం ఇవ్వకుండా తిరిగి సవాల్ విసిరారు. తాను చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నాను. మేము ప్రశ్నిస్తోంటే మాపై ఎదురుదాడికి దిగుతున్నారు' అని సుంకర పద్మశ్రీ అన్నారు. నన్నపనేనిలా డ్రామాలాడడం తమకు చేతకాదని, అలా చేయలేమని, నిజంగానే మహిళల కోసం పోరాడుతున్నామని చెప్పారు.