Harish Rao: రిజర్వాయర్ పనుల విషయంలో ఏజెన్సీకి ఫైనల్ నోటీసు జారీ: మంత్రి హరీశ్‌రావు
- పెండ్లిపాకల రిజర్వాయర్ పనుల విషయంలో నోటీసులు
- వెంటనే పనులు ప్రారంభించకపోతే మళ్లీ టెండర్లు
- 470 కోట్లతో డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు
- 60 శాతం పూర్తయ్యాయి
వచ్చే వర్షాకాలం నాటికి డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో 4 టీఎంసీ నీటిని నిల్వ చేస్తామని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఈ రోజు నల్లగొండ జిల్లా చందంపేట మండలం నక్కలగండి తండా దగ్గర డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను ఆయన పరిశీలించారు. దీనిని ఎలిమినేటి మాధవరెడ్డి ఎస్.ఎల్.బి.సి. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు. రిజర్వాయర్ కాలువకట్ట పైన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. 470 కోట్లతో చేపట్టిన డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు 60 శాతం పూర్తయ్యాయని హరీశ్ రావు చెప్పారు. ఈ రిజర్వాయర్ పనులు వేగంగా జరుగుతున్నట్టు తెలిపారు.
మిగతా పనులు కూడా 2018 వానాకాలం నాటికి పూర్తయ్యేలా ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 7.50 టీఎంసీలని చెప్పారు. ఇందులో 4 టీఎంసీలను వచ్చే వర్షాకాలం కల్లా నిల్వ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. డి.బి.ఆర్.కు చెందిన ఒకటవ టన్నెల్ 43 కిలోమీటర్లలో 30 కిలోమీటర్ల తవ్వకాలు పూర్తయినట్టు మంత్రి చెప్పారు. మిగతా పనులు కూడా పుంజుకున్నాయన్నారు.
అలాగే రెండవ టన్నెల్ తవ్వకం పనులు 100 శాతం పూర్తయినట్టు హరీశ్ రావు తెలియజేశారు. 50 శాతం లైనింగ్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. పెండ్లిపాకల రిజర్వాయర్ పనుల విషయంలో ఏజెన్సీకి ఫైనల్ నోటీసు జారీ చేశామని, వెంటనే పనులు ప్రారంభించకపోతే మళ్లీ టెండర్లు పిలుస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.