Rajinikanth: ప్రకటనకు ముందు కొన్ని నిమిషాలు ధ్యాన ముద్రలో రజనీకాంత్!
- ధ్యాన ముద్ర తర్వాత ప్రసంగం ప్రారంభం
- ద్రవిడ పార్టీలకు భిన్నంగా పయనం
- పక్కా ప్లాన్ తో రజనీ ప్రసంగం
రాజకీయాల్లోకి రావడానికి సమయం ఆసన్నమైందని... రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నానని సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రకటనకు ముందు ఆయన కొన్ని నిమిషాల పాటు ధ్యాన ముద్రలో ఉన్నారు. ఆ తర్వాత 'కర్మణ్యే వాధికారస్తే' అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 'జైహింద్' అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
మరోవైపు, రజనీ ప్రసంగం మొత్తం పక్కా ప్రణాళికతోనే జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎవర్నీ నొప్పించకుండా, తన మనసులోని మాటను స్పష్టం చేశారని అంటున్నారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వనున్నారన్న విషయాన్ని రజనీ వెల్లడించకపోవడం విశేషం. తమిళనాడులో ద్రవిడ పార్టీలే ఇంతకాలం అధికారంలో ఉన్నాయి. రజనీ మాత్రం సరికొత్త రీతిలో తన పార్టీని తీసుకురానున్నట్టు ప్రకటించారు. తాము అధికారంలోని వస్తే ఆధ్యాత్మికంగా పాలన ఉంటుందని చెప్పారు. అంటే, ద్రవిడ పార్టీలకు విభిన్నంగా తన శైలి ఉంటుందని రజనీ చెప్పకనే చెప్పారు. మూస విధానాలకు ముగింపు పలుకుతానన్న కార్యాచరణ అతని మాటల్లో పరోక్షంగా ధ్వనించింది.