Prakash Raj: నన్ను రెచ్చగొట్టొద్దు ప్లీజ్.. రాజకీయాల్లోకి వస్తా: ప్రకాశ్ రాజ్
- రాజకీయాలు చాలా కష్టమైన పని అన్న విలక్షణ నటుడు
- రెచ్చగొడితే మాత్రం రాజకీయాల్లోకి రాక తప్పదని వ్యాఖ్య
- బెంగళూరు ప్రెస్ క్లబ్ నుంచి ‘ఉత్తమ వ్యక్తి’ అవార్డు స్వీకరణ
తనను పదేపదే రెచ్చగొట్ట వద్దని, అలా చేస్తే రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నాడు. రాజకీయాలంటే తనకు ఏమాత్రం ఆసక్తి లేదని, అవి చాలా కష్టమైనవని, అయితే ఊరికనే రెచ్చగొడితే మాత్రం రాజకీయాల్లోకి వస్తానని అన్నాడు. ఆదివారం బెంగళూరులో ప్రెస్ క్లబ్ ఆఫ్ బెంగళూరు నుంచి 2017 సంవత్సరానికి గాను ‘ఉత్తమ వ్యక్తి’ అవార్డు అందుకున్న అనంతరం ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడాడు. బెంగళూరును బెందకాళూరు అని కూడా పిలుస్తారని, శాంతికి భంగం కలిగించి అశాంతి సృష్టించాలనుకునే వారి వ్యాఖ్యలు ఇక్కడ సాగవని హెచ్చరించారు.
ప్రకాశ్ రాజ్ ఇటీవల రాజకీయాల గురించి తరచూ మాట్లాడుతున్నాడు. బెంగళూరులో ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య తర్వాత రాజకీయాల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. లంకేశ్ హత్య విషయంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాడు. ఆ తర్వాత అడపాదడపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెబుతూనే.. ‘ఈ విజయంతో మీరు నిజంగా హ్యాపీగా ఉన్నారా?’ అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించాడు.