ecommerce: నేటి నుంచి ఈ కామర్స్ సైట్లలో ఉత్పత్తుల ధరల్లో మాయాజాలం చెల్లదు!
- కృత్రిమంగా ధరల్ని అధికం చేసి చూపుతూ వాటిపై తగ్గింపులు
- ఈ కామర్స్ సైట్ల మోసపూరిత విధానాలకు ఇకపై చెక్
- ఎంఆర్పీని ప్రకటించడం తప్పనిసరి
ఈ కామర్స్ సంస్థలు నేటి నుంచి ప్యాకేజ్డ్ ఉత్పత్తుల ఎంఆర్పీ ధరల్ని, గడువు తీరే వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ కామర్స్ సంస్థలు ఉత్పత్తుల ధరల్ని ఎక్కువ చూపించి తగ్గింపులు ఇస్తుండడంతో దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలిచ్చింది. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో 10,000 ఈ కామర్స్ వెబ్ సైట్లకు గాను 41 శాతం సంస్థలు గరిష్ట చిల్లర ధరల్ని కావాలని పెంచేసి వాటిపై తగ్గింపులను ఇస్తున్నట్టు తేలింది.
దీంతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఉత్పత్తుల అసలు ధరల్ని ప్రదర్శించేలా చేయడంతోపాటు మోసపూరిత డిస్కౌంట్లను అడ్డుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రముఖ ఈ కామర్స్ సైట్లు అమేజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ ఈ నూతన నిబంధనలను అమలు చేసేందుకు ఇప్పటికే చర్యల్ని ప్రారంభించాయి. కొత్త నిబంధనలకు అనుగుణంగా ఈ సంస్థలు విక్రయదారులతో తమకున్న విధానాలను సవరించాల్సి ఉంటుంది. అయితే, మిగిలిన సంస్థలను చూస్తే చాలా వరకు కొత్త నిబంధనలకు సన్నద్ధం కాలేదని తెలుస్తోంది.