Telangana: తెలంగాణ పోలీసు స్టేషన్లన్నింటికి సోషల్ మీడియా ఖాతాలు!
- ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా ప్రజలకు అందుబాటులో
- త్వరలో అమలు
- వెల్లడించిన డీజీపీ మహేందర్ రెడ్డి
త్వరలో తెలంగాణలోని అన్ని పోలీసు స్టేషన్లకి ప్రత్యేకంగా ఒక ఫేస్బుక్, ఒక ట్విట్టర్ ఖాతాను సృష్టించబోతున్నారు. తద్వారా ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కృషి చేస్తున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో రక్షణ, భద్రతలను ప్రజలందరికీ చేరువ చేసే యోచనలో భాగంగా సాంకేతిక పరిజ్ఞాన సహకారం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 800 పోలీసు స్టేషన్లకు ప్రత్యేక సోషల్‌మీడియా ఖాతాలను సృష్టించనున్నారు. మొదట హైద్రాబాద్‌లోని స్టేషన్లకి, తర్వాత ఇతర జిల్లాల్లోని స్టేషన్లకి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ ఖాతాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుంటామని మహేందర్ రెడ్డి చెప్పారు.