Jignesh Mevani: దమ్ముంటే మార్చండి చూద్దాం.. మా శక్తి ఏంటో చూపిస్తాం: దళిత నేత జిగ్నేష్
- సెక్యులర్ అనే పదాన్ని తొలగిస్తామంటూ ఇటీవల కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
- మండిపడ్డ దళిత నేత, ఎమ్మెల్యే జిగ్నేష్
- ప్రజల అభీష్టం మేరకే చట్టాల రూపకల్పన జరగాలి
- మీ ఇష్టం వచ్చినట్లు కాదు
రాజ్యాంగాన్ని సవరించి, సెక్యులర్ అనే పదాన్ని తొలగిస్తామంటూ కేంద్ర మంత్రి అనంత కుమార్ హెగ్డే ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, గుజరాత్లోని వాద్గం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన దళిత నేత జిగ్నేష్.. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై మండిపడ్డారు. పుణేలో నిర్వహించిన ‘ఎల్గార్ పరిషత్’లో ఆయన మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని గౌరవించని నేతలకు చట్టసభల్లో కొనసాగే అర్హత లేదని అన్నారు.
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య పద్ధతిని మారుస్తామని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని, వారికి దమ్ముంటే అలా చేయాలని సవాలు విసిరారు. తమ శక్తిని ఉపయోగించి దానిని ఎలా అడ్డుకోవాలో తమకు బాగా తెలుసని హెచ్చరించారు. ప్రజల అభీష్టం మేరకే చట్టాల రూపకల్పన జరగాలని, రాజకీయ నేతలు తమకు ఇష్టం వచ్చినట్లు రాజ్యాంగాన్ని మారుస్తామనడం సరికాదని తెలిపారు.