Venkaiah Naidu: పాతచింతకాయ పచ్చడిని తింటే గదా, దాని రుచి తెలిసేది!: వెంకయ్యనాయుడు
- 29వ 'విజయవాడ పుస్తక' మహోత్సవాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
- మన పెద్దవాళ్లు చెప్పిన మాటలన్నీ చాలా అర్థవంతమైనవి
- పాతచింతకాయ పచ్చడని తీసిపారేయకూడదు
మన పెద్దవాళ్లు చెప్పిన మాటలన్నీ చాలా అర్థవంతమైనవని, ఏదో పాతచింతకాయ పచ్చడని తీసిపారేయకూడదని, ఆ పచ్చడి తింటే గదా, అది ఎంత రుచిగా ఉంటుందో తెలిసేదని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలోని స్థానిక స్వరాజ్య మైదానంలో 29వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని ఆయన, సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, 2018ని తెలుగుభాషా పరిరక్షణ సంవత్సరంగా ప్రకటించడం సంతోషదాయకమని అన్నారు. నాశనం లేనిది, జ్ఞానాన్ని పంచేది అక్షరమేనని, పుస్తక మహోత్సవం ఎంతో పవిత్రమైందని, మన పురాణాలు, ఇతిహాసాలను పరిశీలిస్తే పుస్తకానికి, అక్షరానికి ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. సమాజాన్ని నడిపించేది అక్షరమేనని, అన్నివైపుల నుంచి జ్ఞానం వర్థిల్లాలని రుగ్వేదంలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.
మన పెద్దవాళ్లు చెప్పిన మాటలన్నింటికీ శాస్త్రీయసాంకేతిక పరిజ్ఞానం, వేల సంవత్సరాల నాటి అనుభవం వాటిలో ఇమిడి వుంటాయని, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరముందని సూచించారు. అంతేగానీ, పాత చింతకాయపచ్చడి కింద తీసిపారేయకూడదని, అది ఎంత రుచిగా ఉంటుందో తింటే కదా తెలిసేదని ఆయన అనడంతో నవ్వులు విరిశాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు ఆవకాయలో కొంచెం పాత చింతకాయ పచ్చడి, పప్పు వేసుకుని తింటే ఆ రుచి చెప్పనలవికాదని అంటారని, వారిలా తనకూ తినాలనిపిస్తోందని వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలకు నవ్వులు విరిశాయి.