Revanth Reddy: కేసీఆర్ మాయలో పవన్ పడిపోయారు.. శోచనీయం!: రేవంత్ రెడ్డి
- పవన్ వద్ద సరైన సమాచారం లేదు
- సమాచారం మేము ఇస్తాం
- కిరణ్ కుమార్ రెడ్డి చెప్పింది నిజమే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాయలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పడిపోయారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఆర్భాటాలకు పవన్ ఫ్లాట్ అయ్యారని... ఇది అత్యంత శోచనీయమైన అంశమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ వద్ద సరైన సమాచారం లేదనే విషయం అర్థమవుతోందని... ఆయనకు సరైన సమాచారం అందించాల్సిన బాధ్యత తమపై ఉందని తాము భావిస్తున్నామని చెప్పారు.
ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆరోజు వాస్తవాలే మాట్లాడారని తెలిపారు. విద్యుత్ సంస్థలను రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విభజిస్తే... తెలంగాణకు 42 శాతం వాటా మాత్రమే వస్తుందని, ఈ నేపథ్యంలో రాష్ట్రం చీకటిలో మగ్గిపోతుందని కిరణ్ చెప్పారని గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ నేతల కృషితో జనాభా ప్రకారం కాకుండా, వినియోగం ప్రకారం విద్యుత్ సంస్థల విభజన జరిగిందని చెప్పారు. హైదరాబాదులో ఐటీ సంఖ్యలు అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో, వాటికి అంతరాయం కలగకుండా, నగరంలో 24 గంటలపాటు విద్యుత్ ఇవ్వాలన్న ఉద్దేశంతో, ఎక్కువ శాతం విద్యుత్ సంస్థలను కేటాయించారని తెలిపారు. ఈ విషయాలను పవన్ కల్యాణ్ గమనించలేకపోయారని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రదేశ్ లో కాంగ్రెస్ హయాంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ఎన్నో చర్యలను చేపట్టారని, కొత్త ప్రాజెక్టును ప్రారంభించారని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ నేతల కృషితోనే తెలంగాణలో మిగులు విద్యుత్ సాధ్యమయిందని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి పెరుగుదల కోసం కేసీఆర్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు దేశంలో ఎన్నో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిరంతర విద్యుత్ ను అందిస్తున్నాయని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం 'ఉదయ్ స్కీమ్'లో భాగంగా రాష్ట్రానికి అదనపు విద్యుత్ వచ్చిందని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ అనే ముసుగులో కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ ఈ విషయాలను తెలుసుకోకుండా మాట్లాడటం బాధను కలిగించిందని చెప్పారు. ఆయనకు అవసరమైన సమాచారాన్ని తాము అందిస్తామని తెలిపారు.