note: రెండున్నర రూపాయల నోటుకి నేటితో వందేళ్లు పూర్తి!
- 1918, జనవరి 2న విడుదలైన నోటు
- రెండు రూపాయల ఎనిమిది అణాల నోటును తయారు చేసిన బ్రిటిషిండియా ప్రభుత్వం
- అప్పట్లో ఒక డాలర్‌కి సమానం
1918, జనవరి 2న అప్పటి బ్రిటిషిండియా ప్రభుత్వం ఓ అరుదైన కరెన్సీ నోటును ముద్రించింది. రెండు రూపాయల ఎనిమిది అణాల నోటు అది. అంటే రెండున్నర రూపాయలు అన్నమాట (ఒక రూపాయికి పదహారు అణాలు). ఈ నోటు నేటితో వందేళ్లు పూర్తిచేసుకుంది. 1917లో మొదటిసారిగా బ్రిటిషిండియా ప్రభుత్వం రూ. 1 నోటును ముద్రించింది. తర్వాత ఏడాది ఈ రెండున్నర నోటును ముద్రించింది.
ఈ నోటును బ్రిటన్‌లో ముద్రించారు. దీని మీద బ్రిటన్ చక్రవర్తి ఐదో జార్జి బొమ్మతో పాటు, అప్పటి బ్రిటిష్ ఆర్థిక కార్యదర్శి ఎమ్ ఎమ్ ఎస్ గబ్బే సంతకం ఈ నోటు మీద ఉన్నాయి. అప్పట్లో వాడకంలో ఉన్న సర్కిల్ కోడ్‌ను కూడా ఈ నోటు మీద చూడొచ్చు. ఈ కోడ్ల ప్రకారం `సి` అనే అక్షరం కలకత్తా సర్కిల్‌ని సూచిస్తుంది.
ఈ కోడ్ ప్రకారం ఎ అంటే కాన్పూర్, బి అంటే బాంబే, కె అంటే కరాచీ, ఎల్ అంటే లాహోర్, ఎమ్ అంటే మద్రాస్, ఆర్ అంటే రంగూన్ సర్కిళ్లు అన్నమాట. అప్పట్లో ఈ రెండున్నర రూపాయల నోటు ఒక డాలర్‌కి సమానమట. 2015లో ఈ నోటు ఓ వేలంలో రూ. 6,40,000 పలికింది.