Chandrababu: అప్పుడు కనుక ఆ ఫ్లాష్ నొక్కితే చాలా దారుణం జరిగిపోయేది!: సైబర్ క్రైమ్ ఎస్పీ రామ మోహన్
- నాటి అలిపిరి ఘటనను ప్రస్తావించిన రామ మోహన్
- సంఘటనా స్థలంలో వెతుకుతుండగా కెమెరా ఫ్లాష్ దొరికింది
- ‘అతను ఫ్లాష్ బటన్ నొక్కితే ’ అనే ఆలోచన రాగానే..జంప్ చేసి ఆ కెమెరా ఫ్లాష్ లాక్కున్నా
నాడు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడిని లక్ష్యంగా చేసుకుని జరిగిన అలిపిరి బ్లాస్ట్ ఘటనపై అప్పటి ఎస్పీ రామ మోహన్ ఆశ్చర్యకర విషయాలను చెప్పారు. ‘ఐ డ్రీమ్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఈ ఘటన సమాచారం అందడంతో హైదరాబాద్ లో ఉన్న నేను వెంటనే తిరుపతికి ఫ్లైట్ లో వెళ్లాను. సంఘటనా స్థలానికి నేను వెళ్లగానే, నాతో పాటు చాలామంది పోలీసులు కూడా అక్కడికి వచ్చి వెతుకుతున్నారు.
ఈ క్రమంలో ఒక చెట్టు గుబురులో నుంచి కెమెరా ఫ్లాష్ ఒకరికి దొరికింది. అది ఆన్ లో ఉంది. అప్పుడు కనుక దానిని నొక్కి ఉంటే మిగిలిన ఎనిమిది క్లైమోర్ మైన్స్ పేలిపోయేవి. సుమారు ఐదారు వందల మంది పోలీసులు, ప్రెస్ వాళ్లు కూడా అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి వెళ్లమని చెప్పినా కూడా ప్రెస్ వాళ్లు వెళ్లలేదు. మాకేమో భయం! ఎందుకంటే, ఫొటోలు తీసేందుకు కెమెరా క్లిక్ చేస్తే ఫ్లాష్ కారణంగా ఈ క్లైమోర్ మైన్స్ ఎక్కడ పేలిపోతాయోననే అనుమానం మాది.
ఈ విషయాన్ని ప్రెస్ వాళ్లకు వివరించి చెబితే అప్పుడు వెళ్లారు. కెమెరా ఫ్లాష్ దొరికినతను ‘సార్ ఫ్లాష్’ అన్నాడు. అతను ఈ ఫ్లాష్ నొక్కితే పేలిపోతాయనే ఆలోచన వచ్చింది. దాంతో వెంటనే.. నాకు ఐదారడుగుల దూరంలో ఉన్న అతనిపైకి జంప్ చేసి ఆ కెమెరా ఫ్లాష్ ని లాక్కున్నా. వెంటనే, డిస్కనెక్ట్ చేసి..అక్కడ అంతా వెతికితే ఇంకా ఎనిమిది క్లైమోర్ మైన్స్ బయటపడ్డాయి. ఒక్కొక్క క్లైమోర్ మైన్ లో 32 కిలోల కెమికల్ ఉంది. ఆ రోజున ఆ కెమెరా ఫ్లాష్ ని అతను నొక్కి ఉంటే చాలా దారుణం జరిగిపోయేది’ అని చెప్పుకొచ్చారు.