triple talaq: రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై గందర గోళం.. రేపటికి వాయిదా
- ట్రిపుల్ తలాక్ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలి
- ఈ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడం లేదు
- మహిళా సాధికారత అత్యంత ముఖ్యమైన అంశం
- బిల్లులో చేయాల్సిన సవరణలను కమిటీ సూచిస్తుంది- కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ
రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై గందరగోళం చెలరేగింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇటీవలే లోక్సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇక రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. రాజ్యసభలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ట్రిపుల్ తలాక్ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లును తాము వ్యతిరేకించడం లేదని, సెలెక్ట్ కమిటీకి పంపాలన్నదే తమ డిమాండని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ అన్నారు.
మహిళా సాధికారత అత్యంత ముఖ్యమైన అంశమని ఆయన అన్నారు. బిల్లులో సవరణలను చేయాల్సి ఉందని, వాటిని సెలెక్ట్ కమిటీ సూచిస్తుందని అన్నారు. అయితే, అందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.