kumar viswas: కేజ్రీవాల్ పై యుద్ధం ప్రకటించిన కుమార్ విశ్వాస్
- కేజ్రీవాల్ విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు
- నేనెప్పుడూ ఇంత నిరాశకు గురి కాలేదు
- నిజాలు మాట్లాడినందుకు శిక్షించారు
రాజ్యసభకు ఆప్ ఎంపిక చేసిన ముగ్గురు అభ్యర్థులలో తాను లేకపోవడం పట్ల ఆ పార్టీ సీనియర్ నేత కుమార్ విశ్వాస్ మండిపడ్డారు. నిజాలను మాట్లాడినందుకు తనను శిక్షించారని అన్నారు. పార్టీ అధినేత కేజ్రీవాల్ పై పబ్లిక్ గా విమర్శలు చేస్తూ, ఒక రకంగా యుద్ధాన్ని ప్రకటించారు. కేజ్రీ విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని విమర్శించారు. ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు గుప్తాలు ఉండటం పట్ల వారికి, కేజ్రీకి అభినందనలు తెలుపుతున్నానని ఎద్దేవా చేశారు.
వాజపేయి, ఇందిరాగాంధీల లాంటి మహామహులు కూర్చున్న చోట వీరు కూర్చోబోతున్నారని అన్నారు. పార్టీలో తాను ఇంత నిరాశకు ఎన్నడూ గురి కాలేదని చెప్పారు. కేజ్రీ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను తాను ప్రశ్నించానని... దీంతో, తనను శిక్షించారని ఆరోపించారు.
'నీవు చనిపోయిన వ్యక్తితో సమానం... అయితే, నిన్ను అమరవీరుడిగా నేను చేయబోను' అంటూ గతంలో కేజ్రీవాల్ తనతో అన్నారని... ఇప్పుడు తాను ఒకటే చెబుతున్నానని... 'డెడ్ బాడీతో పెట్టుకోవద్దు... దుర్వాసనను వ్యాపింపజేయవద్దు' అని అన్నారు.
మరోవైపు, కుమార్ విశ్వాస్ ను రాజ్యసభకు పంపాలని ఆయన మద్దతుదారులు పార్టీపై ఒత్తిడి తెచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. కేజ్రీవాల్ తో ఉన్న విభేదాల నేపథ్యంలో ఆయనకు టికెట్ దక్కలేదు.