కొండచిలువ: కొండచిలువను రైలులో మర్చిపోయిన ప్రయాణికుడు.. 150 కిలోమీటర్లు ప్రయాణించిన పాము!

  • కొండచిలువను పట్టుకుని రైలెక్కిన ప్రయాణికుడు
  • సంచిని మర్చిపోయి దిగిపోయాడు
  • ఐడీ కార్డుల ఆధారంతో అరెస్ట్

కొండచిలువను పట్టుకుని దానిని సంచిలో వేసుకున్న ఓ వ్యక్తి దానితోపాటు రైలెక్కాడు. అయితే దిగేటప్పుడు మాత్రం ఆ సంచిని మర్చిపోయాడు. ఆ పాము 150 కిలోమీటర్లు ప్రయాణించినా ఎవరూ ఆ సంచిని పట్టించుకోలేదు. చివరకు బ్యాగులో ఏదో కదులుతున్న విషయాన్ని గుర్తించిన ఓ ప్రయాణికుడు అధికారులకు సమాచారం అందించడంతో, వారొచ్చి సంచిని తనిఖీ చేశారు. అందులో కొండచిలువ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కేరళలో జరిగిందీ ఘటన.

అలప్పుజాకు చెందిన జిజో జార్జ్ (29) ఈనెల 1న పాలక్కాడ్‌లో అక్రమంగా ఓ కొండచిలువను పట్టుకున్నాడు. దానిని తన సంచిలో వేసుకుని పాలక్కాడ్‌లో ఒట్టప్పాలం-ఎర్నాకులం రైలు ఎక్కాడు. సంచిని  సీటు కింద పెట్టిన జార్జ్ ఎర్నాకుళంలో దానిని మర్చిపోయి రైలు దిగాడు. కొండచిలువను పెట్టిన సంచిలోనే తన ఐడీ కార్డులు, ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. 


కొండ చిలువ ఉన్న సంచి రైలుతోపాటు అలాగే 150  కిలోమీటర్లు ప్రయాణించింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఓ ప్రయాణికుడు దానిని గమనించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి బ్యాగును తెరిచి చూసి ఆశ్చర్యపోయారు. అందులో బతికి ఉన్న కొండ చిలువ ఉండడంతో దానిని తీసుకెళ్లి కొట్టాయం అడవుల్లో వదిలేశారు. బ్యాగులోని ఐడీ కార్డుల ఆధారంగా అలప్పుజాలోని ఆయన ఇంటిలో జార్జ్‌ను అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా కొండచిలువను చంపి కూర వండుకునేందుకే దానిని పట్టుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

  • Loading...

More Telugu News