Mudragada Padmanabham: పవన్ కల్యాణ్ తెలీదని చెప్పలేదు: మాట మార్చిన ముద్రగడ!
- నిన్న పవన్ ఎవరో తెలియదన్న ముద్రగడ
- తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ
- వ్యక్తిగతంగా కలవలేదని మాత్రమే చెప్పాను
- కాపులకు తక్షణం బీసీ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన ముద్రగడ
బుధవారం నాడు సినీ నటుడు పవన్ కల్యాణ్ ఎవరో తెలియదని ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, 24 గంటలు తిరగకుండానే మాట మార్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పిన ఆయన, పవన్ తో తనకు పరిచయం లేదని మాత్రమే చెప్పానని, ఆయనెవరో తెలియదని తాను అనలేదని వివరణ ఇచ్చారు. వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ ను తానెన్నడూ కలవలేదని, మీడియా ప్రశ్నించిన వేళ, తాను అదే విషయాన్ని చెప్పానని అన్నారు.
తమ హక్కుల సాధనకై కాపు ఉద్యమం రెండు సంవత్సరాలుగా నడుస్తోందని, అసెంబ్లీ, మండలిలో బిల్లుపెట్టి తీర్మానం చేసిన ప్రభుత్వం, కాపులను ఇంకా పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదని చెప్పుకొచ్చారు. సంక్రాంతి కానుకగా, విద్య, ఉద్యోగ రంగాల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే, తమ జాతి సంతోషిస్తుందని ముద్రగడ వ్యాఖ్యానించారు. కాపులకు తక్షణమే బీసీ సర్టిఫికెట్ల జారీని ప్రారంభించాలని డిమాండ్ చేసిన ఆయన, ఇంకా కాపు ఉద్యమం ఆగలేదని స్పష్టం చేశారు.