odf: బహిరంగ మల విసర్జన రహిత నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్
- ప్రకటించిన కేంద్రం
- ఆనందం వ్యక్తం చేసిన మేయర్ బొంతు రామ్మోహన్
- కేటీఆర్ చలువే అని వ్యాఖ్య
కొత్త సంవత్సరం హైదరాబాద్ నగరానికి నిజంగానే కొత్త గుర్తింపును తీసుకువచ్చింది. బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. ఈ మేరకు కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) చేపట్టిన 98 పబ్లిక్ టాయ్లెట్ల నిర్మాణం, సాధారణ టాయ్లెట్ల వినియోగానికి పెట్రోల్ బంకులు, మాల్స్‌ను ఒప్పించడం వంటి పనులను గుర్తించి స్వచ్ఛ్ భారత్ మిషన్ ఈ గుర్తింపును అందజేసింది.
ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'ఓడిఎఫ్ గుర్తింపును సాధించడం చాలా కష్టమైన పని అనుకున్నా... కానీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు ప్రోత్సాహంతో సులభంగా సాధించే వీలు కలిగింది. ఇదే ప్రోత్సాహంతో ముందుకు నడిచి స్వచ్ఛ్ సర్వేక్షణ్- 2018లో మొదటి స్థానం సంపాదించేందుకు ప్రయత్నిస్తాం' అని రామ్మోహన్ అన్నారు.
క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సలహా మేరకు కేంద్రం ఈ గుర్తింపును జారీ చేస్తుంది. ఈ గుర్తింపు శాశ్వతం కాదు.. ప్రతి ఆరునెలలకు ఒకసారి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమీక్షలు చేపట్టి, మళ్లీ నిర్ణయిస్తుంది. హైదరాబాద్‌తో పాటు వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్, మిర్యాలగూడ, జనగాం, బెల్లంపల్లి, మంచిర్యాల, సదాశివపేటలకు కూడా ఈ గుర్తింపు లభించింది.