kcr: ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించే విధంగా కేంద్ర విధానం ఉండాలి!: కేసీఆర్
- రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం
- పండించిన పంటలకు మద్దతు ధర అందించడానికి కృషి
- సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం, చెరువులు పునరుద్ధరించాం
- వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం
రైతులను అన్ని విధాలా ఆదుకోవడానికి, పండించిన పంటలకు మద్దతు ధర అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు ఓ సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ... రైతులు పండించిన పంటలకు మార్కెట్ లో మద్దతు ధర రాకపోతే ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసే విధానం తీసుకురావాలని అధికారులకు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారని, అందువల్ల రైతాంగం నష్టపోయిందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం కోసం ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామన్నారు.
సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, చెరువులు పునరుద్ధరించామని, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, ఎరువులు/విత్తనాల కొరత లేకుండా చేశామని, గోదాములు నిర్మించామని కేసీఆర్ చెప్పారు. ఎకరానికి ఏడాదికి ఎనిమిది వేల పెట్టుబడిని ఈ ఏడాది నుంచే అందిస్తున్నామని, ప్రతీ 5వేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించామని, రైతులను సంఘటిత శక్తిగా మార్చామని, వ్యవసాయ యూనివర్సిటీని బలోపేతం చేశామని తెలిపారు.
‘మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా మరింత ఉదారంగా వ్యవహరించాల్సి ఉంది. వరి, మొక్కజొన్నలకు ప్రస్తుతం ప్రకటించిన మద్దతు ధర పెరగాల్సి ఉంది. ఈ రెండింటికి రూ.2 వేల మద్దతు ధర ప్రకటించాలి. కొన్ని వ్యవసాయ ఉత్పత్తులకు అసలు మద్దతు ధరే లేదు. కాబట్టి దేశంలో పండే ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించే విధంగా కేంద్ర విధానం ఉండాలి. దీనికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతాం. టీఆర్ఎస్ పార్టీ పరంగా పార్లమెంటులో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తాం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.