crypto currency: క్రిప్టోకరెన్సీ మీద దృష్టి సారించబోతున్న ఫేస్‌బుక్?
- ఓ పోస్ట్‌లో వెల్లడించిన మార్క్ జుకర్‌బర్గ్
- ఉపయోగాలను అధ్యయనం చేస్తామని వెల్లడి
- ఫేస్‌బుక్ రంగంలోకి దిగితే మంచి రోజులే!
ఇటీవల చర్చనీయాంశంగా మారిన క్రిప్టోకరెన్సీ మీద సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ దృష్టి పడినట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీ మీద అధ్యయనం చేసి, దాని వల్ల కలిగే ఉపయోగాలను, నష్టాలను అంచనా వేసి, అందుకు తగిన విధంగా తమ మాధ్యమంలో అందుబాటులోకి తీసుకువస్తామని ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. 2018కి గాను తమ కంపెనీ లక్ష్యాలను తెలుపుతూ ఆయన చేసిన పోస్టులో ఈ విషయాన్ని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఫేక్ న్యూస్‌ని, అసభ్యకర పోస్టులను, రాజకీయాల్లో ఫేస్‌బుక్ దుష్ప్రభావాన్ని అరికట్టడానికి కృషి చేయనున్నట్లు ఆయన పోస్ట్‌లో చెప్పారు. ఒకవేళ ఫేస్‌బుక్ గనక క్రిప్టోకరెన్సీ లాభాలను గుర్తించగలిగి, అందుబాటులోకి తీసుకువస్తే.. ప్రపంచ ద్రవ్యవిధాన రూపురేఖలు మారిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.