america: పాకిస్థాన్ కు సాయాన్ని పూర్తిగా నిలిపివేయాలన్న సలహాను మెచ్చుకున్న ట్రంప్
- ఈ మేరకు ట్వీట్
- ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది సెనేటర్ పాల్
- పాకిస్థాన్ కు సాయంతో వచ్చిందేమీ లేదని వ్యాఖ్యలు
పాకిస్థాన్ కు సాయాన్ని కొద్దిగా కాకుండా పూర్తిగా నిలిపివేయాలంటూ సెనేటర్ రాండ్ పాల్ ఇచ్చిన సలహాను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మెచ్చుకున్నారు. 'మంచి ఐడియా' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. కెంటకీ సెనేటర్ రాండ్ పాల్ ఈ ప్రతిపాదనను చేస్తూ శుక్రవారం వీడియోను పోస్ట్ చేశారు. పాకిస్థాన్ కు అందించే సాయమంతటినీ నిలిపివేయాలని కోరుతూ ఓ బిల్లును కూడా తీసుకొస్తానని పాల్ ప్రకటించారు.
‘‘రానున్న రోజుల్లో నేనొక బిల్లును ప్రవేశపెడతా. పాకిస్థాన్ కు వెళ్లే సాయాన్ని నేను ప్రవేశపెట్టే బిల్లు ఆపేస్తుంది. ఆ నిధుల్ని స్వదేశంలోనే రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి వినియోగించాలి. మనం మన దేశాన్ని నిర్మించుకోవాలి. విదేశాలను కాదు. విదేశాలకు నిధులు అందించడాన్ని నిలిపివేయడమే అమెరికా విధానం కావాలి’’ అని పాల్ పేర్కొన్నారు.
ఇదే వీడియోలో పాల్ పాకిస్థాన్ ను ఏకిపారేశారు. ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయమిస్తోందని, కీలక సమాచారాన్ని కప్పి పెడుతోందని విమర్శించారు. 2002 నుంచి పాకిస్థాన్ కు 33 బిలియన్ డాలర్ల నిధులు అందించినా తాము పొందిందేమీ లేదన్నారు. కనీసం లాడెన్ ను పట్టుకునేందుకైనా సాయపడలేదన్నారు.