Vijayawada: దుర్గమ్మకు అపచారం నిజమే... పోలీసుల విచారణ నివేదిక తెలుసుకుని, చంద్రబాబు తీవ్ర ఆగ్రహం!

  • ప్రత్యేక పూజలు, మహిషాసుర మర్దిని అలంకరణ నిజం
  • ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందన్న డీసీపీ కాంతి రాణా టాటా
  • విషయం విని విస్తుపోయిన సీఎం చంద్రబాబు
  • మరింత లోతైన విచారణ జరపాలని ఆదేశం

బెజవాడ కనకదుర్గమ్మకు అపచారం జరిగిన మాట వాస్తవమేనని, అమ్మవారిలోని తాంత్రిక శక్తులను నిద్రలేపేందుకు ప్రత్యేక పూజలు, మహిషాసుర మర్దిని అలంకరణ కూడా చేశారని, ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని పోలీసులు తమ విచారణలో తేల్చారు. ఈ ఘటన వెనకున్నది ఈఓ సూర్యకుమారని గుర్తించారు.

దుర్గ గుడిలో అర్ధరాత్రి పూజలపై నిజనిర్ధారణ కమిటీతో పాటు పోలీసులు సమాంతరంగా విచారణ నిర్వహించిన విషయం తెలిసిందే. డీసీపీ కాంతి రాణా టాటా నేతృత్వంలోని బృందం ఈ విచారణ జరిపి, 20 మందిని విచారించగా, వారిలో ముగ్గురు ప్రత్యేక పూజలు తాము జరిపినట్టు అంగీకరించగా, వారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ విచారణ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పోలీసు అధికారులు నివేదికను సమర్పించగా, విషయం విని చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఇది పూర్తి స్థాయి పాలనా వైఫల్యమేనని, ఇంత జరుగుతుంటే అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే మరింత లోతుగా దర్యాఫ్తు చేయాలని ఆదేశించారు. మరెక్కడైనా దేవాలయాల్లో ఇలాంటి ప్రయత్నాలు సాగుతున్నాయా? అన్న విషయాన్ని తేల్చాలని ఆదేశించారు. కాగా, తమను ముందురోజు పిలిపించారని విశ్వనాథపల్లి శివాలయానికి చెందిన పూజారి పార్థసారధి పోలీసు విచారణలో వెల్లడించాడు.

డిసెంబర్ 26 రాత్రి అమ్మవారి కవచాన్ని తొలగించి మహిషాసుర మర్దినిగా అలంకరించి పూజలు చేశామని, ఆపై సాధారణ అలంకారం చేశామని ఆయన చెప్పాడు. అయితే, అలంకరణ కుదరకపోవడంతో, మరుసటి రోజు ఉదయం 9 గంటల తరువాత దర్శనం నిలిపివేసి, సరిచేశామని సుజన్ అనే పూజారి వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు.

అయితే ప్రధాన అర్చకుడు బద్రీనాథ్ బాబు మాత్రం తాము అలంకరణ చేశామే తప్ప పూజలు చేయలేదని వెల్లడించాడని, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన తరువాత క్యూలైన్ ఇన్ స్పెక్టర్ మధు కూడా కనిపించగా, ఆయన్నూ విచారించామని పోలీసులు తమ నివేదికలో తెలిపారు. తమను బయటకు పంపినట్టు ఆయన చెప్పారని, బయటే ఉన్న కారణంగా లోపల ఏం జరిగిందో తెలియదని అన్నారని పేర్కొన్నారు. ఇక నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ను విచారించగా, బద్రీనాథ్ తో పాటు ఇతర అర్చకులు రాత్రి 12.30 తరువాత వెళ్లారని చెప్పినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News