no pant subway ride: ఇదో పిచ్చి... ప్యాంటు వేసుకోకుండా రైలు ప్రయాణం... ఆదివారం రోజు పలు దేశాల్లో ట్రెండ్!
- ముందుగా న్యూయార్క్‌లో ప్రారంభం
- 17 ఏళ్లుగా కొనసాగుతున్న ట్రెండ్
- రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణ
'పిచ్చి పిచ్చి పిచ్చి... రకరకాల పిచ్చి..' అంటూ భానుమతి ఓ సినిమాలో పాట పాడినట్టు ఇప్పుడు విదేశాల్లో ఓ కొత్తరకం పిచ్చి పట్టుకుంది. దీనికి ముద్దుగా No Pants Subway Ride అనే పేరు పెట్టుకున్నారు. అంటే ప్యాంట్లు లేకుండా సబ్వే రైల్లో ప్రయాణించాలన్న మాట. ఆదివారం రోజున పలు దేశాల్లో ఇదిప్పుడు ట్రెండ్ అయింది. ఈ ఈవెంట్‌కి ఓ కారణం అంటూ ఏం లేదు. ఊరికే సరదా కోసం చేయడమే!
మొదటిసారిగా 2002లో ఈ ఈవెంట్ ప్రారంభమైంది. ఓ ఏడుగురు వ్యక్తులు ప్యాంట్ లేకుండా వివిధ స్టేషన్లలో సబ్వే రైలు ఎక్కారు. ఎవరైనా ప్రశ్నిస్తే ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయినట్లుగా సమాధానం చెప్పారు. అలా వాళ్లు ఏడుగురు అప్పట్లో బాగా ఫేమస్ అయ్యారు. దీనిని 'ఇంప్రూవ్ ఎవ్రీవేర్' అనే సంస్థ తీసుకుని బాగా ప్రచారం కల్పించింది.
ప్రతి ఏడాది చలికాలం విపరీత స్థాయిలో ఉండే జనవరి నెలలో ఒక రోజుని No Pants Subway Rideగా జరుపుకోవాలని ప్రచారం చేసింది. ఏ రోజున జరుపుకోవాలనే విషయాన్ని డిసెంబర్ నెలలో వెల్లడించడం ప్రారంభించింది. ఈ లెక్కన ఇప్పటి వరకు దాదాపు 17 ఏళ్లుగా ఈ ఈవెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా కొనసాగేలా చర్య తీసుకుంటున్నారు.
అందులో భాగంగానే జనవరి 7, ఆదివారం రోజున అడిలైడ్, ఆమ్స్టర్డాం, అట్లాంటా, బెర్లిన్, బోస్టన్, బ్రిస్బేన్, షికాగో, కోపెన్హెగన్, జెరూసలెం, లండన్, మాంట్రియల్, మ్యూనిచ్, జ్యూరిచ్, వాషింగ్టన్ డీసీ వంటి నగరాల్లో ఈ ఈవెంట్‌ను విజయవంతం చేశారు. తాము ప్యాంట్ లేకుండా ప్రయాణించిన వీడియోలు, ఫొటోలను పాశ్చాత్య నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.