aadhar: ఆధార్ సీఈఓ పేరుతో నకిలీ ట్విట్టర్ అకౌంట్... చర్య తీసుకుంటామని హెచ్చరించిన యూఐడీఏఐ
- అజయ్ భూషణ్ పాండే పేరుతో నకిలీ అకౌంట్
- యూఐడీఏఐ గుర్తించడంతో చుల్బుల్ పాండేగా మార్పు
- ఒక్కరోజులోనే 350కి పైగా ట్వీట్లు చేసిన వైనం
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)కి కొత్త సమస్య వచ్చింది. సీఈఓ అజయ్ భూషణ్ పాండే పేరుతో ట్విట్టర్లో ఓ కొత్త అకౌంట్ పుట్టుకొచ్చింది. తమను తాము ఆధార్ సీఈఓ పేరడీ అకౌంట్‌గా ఈ ఖాతాను సృష్టించినవాళ్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆధార్ సంస్థ యూఐడీఏఐ అధికారిక ఖాతా గురించి స్పష్టత ఇస్తూ ట్వీట్ చేసింది. అధికారికంగా చర్య తీసుకుంటామని యూఐడీఏఐ హెచ్చరించడంతో అప్పటి వరకు అజయ్ భూషణ్ పాండే పేరుతో ఉన్న ఖాతాను డాక్టర్ చుల్బుల్ పాండేగా మార్చారు.
ఈ రెండు అకౌంట్ల ఖాతాల హ్యాండిళ్లలో ఒక్క అండర్స్కోర్ తేడా మాత్రమే ఉండటం గమనార్హం. ఈ నకిలీ ఖాతా ద్వారా ప్రారంభమైన ఒక్కరోజులోనే దాదాపు 350కి పైగా ట్వీట్లు వచ్చాయి. దాదాపు 237 మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఆధార్ నియమాలను, విధానాలను అవహేళన చేస్తూ ఇందులో ట్వీట్లు ఉన్నాయి.