bahubali: 'ఇప్పుడు ‘బాహుబలి’ గురించి ఎవరైనా చెప్పుకుంటున్నారా?: నటుడు కోట శ్రీనివాసరావు
- ఇప్పటికీ కూడా పాత ‘మాయాబజార్’ గురించి మాట్లాడుకుంటారు
- అలా అని ‘బాహుబలి’ తక్కువని నేను చెప్పట్లేదు
- నాటి దర్శకులు వ్యాపారం చేసినా బాధ్యతగా భావించేవారు
- ఇప్పటివాళ్లలో అది కొరవడిందన్న కోట
‘బాహుబలి’ సినిమా విడుదలకు రెండు నెలల ముందు.. విడుదలైన తర్వాత రెండు నెలల పాటు ఆ సినిమా గురించి దేశంలో ఊదరగొట్టేశారని, ఇప్పుడెవరైనా ఆ సినిమా గురించి చెప్పుకుంటున్నారా? అని ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికీ కూడా పాత 'మాయాబజార్' సినిమా గురించి మాట్లాడుకుంటారని, నాడు కూడా ట్రిక్ ఫొటోగ్రఫీ వాళ్లు కూడా తీశారని ప్రశంసించారు.
అయితే, ‘బాహుబలి’ సినిమా తక్కువని తాను చెప్పట్లేదని.. అద్భుతమైన సినిమా అని, ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకుందనీ ఆయన ప్రశంసించారు. ‘బాహుబలి’ సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారని, వాళ్లెవరికీ పేరు రాలేదని, దర్శకుడు రాజమౌళికి మాత్రమే పేరు వచ్చిందని..దీని అర్థం దర్శకుడు గొప్పవాడని, ఈ లెక్కన పాత దర్శకులు ఇంకెంత గొప్పవాళ్లో అని అన్నారు. నాటి దర్శకులు వ్యాపారం చేసినా బాధ్యతగా భావించేవారని, ఇప్పటివాళ్లలో అది కొరవడిందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.