Andhra Pradesh: ఏపీలో ఉగాది లోపు తెలుగు సంప్రదాయ, ఆరోగ్యకర వంటల పోటీలు.. సీఎం చేతుల మీదుగా బహుమతులు
- జన్మభూమి-మా ఊరులో 'మా పంటలు - మా వంటలు'
- మండల స్థాయిలో పోటీలు
- ఈ నెల 11న పర్యాటక శాఖ నేతృత్వంలో ఆహార పండుగలు
- మండల విజేతలకు రాష్ట్రస్థాయి పోటీలకు పిలుపు
జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఏపీలో 'మా పంటలు - మా వంటలు' పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రాన్ని ఆనంద, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆలోచనల మేరకు మహిళలను భాగస్వాములను చేస్తూ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు. జన్మభూమి కార్యక్రమం చివరి రోజైన పదకొండవ తేదీన మండల స్థాయిలో పర్యాటక, సాంస్కృతిక శాఖ వంటల పోటీలను నిర్వహిస్తుందని, ఆయా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు కార్యక్రమానికి నేతృత్వం వహిస్తారని మీనా వివరించారు.
ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ఆరోగ్యకరమైన వంటలకు సంబంధించిన మెటీరియల్ను సమకూర్చుతుందని గోడ పత్రికలు, ఛాయా చిత్రాలు అందుబాటులో ఉంటాయని, వాటిని జన్మభూమి - మాఊరు కార్యక్రమంలో ప్రదర్శనగా ఉంచుతామని స్పష్టం చేశారు. 'మా పంటలు - మా వంటలు' కార్యక్రమాన్ని మండల కేంద్రాలలో నిర్వహిస్తారని ముఖేష్ కుమార్ మీనా వివరించారు. మూడు విభాగాలుగా పోటీలు జరుగుతాయని, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, తీపి వంటకాల విభాగాలలో ఉత్సాహవంతులు పోటీ పడవచ్చన్నారు. పోటీలకు వినియోగించే వంట సామగ్రిని పాల్గొనే వారే సమకూర్చుకోవలసి ఉంటుందని, ప్రదర్శనకు అవసరమైన ఏర్పాట్లను ఎంపీడీఓ చేపడతారని వివరించారు. స్థానిక వంటలకు తగిన ప్రాచుర్యం కల్పించటం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి తెలిపారు.
ఈ పోటీల ద్వారా ఆరోగ్యకరమైన వంటల తయారీపై అవగాహన పెంపొందుతుందని, మహిళలు తమ నైపుణ్యతను ప్రదర్శించగలుగుతారన్నారు. ఎంపీడీఓ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారని, వీరిలో స్థానిక ప్రజా ప్రతినిధితో పాటు, ఐసీడీఎస్ లేక డీఆర్డీఏ అధికారి సభ్యులుగా ఉంటారని మీనా పేర్కొన్నారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయన్నారు. మండల స్థాయి విజేతలకు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఉత్తమ ఇంటి ఛెప్ పోటీలకు ఆహ్వానం పంపుతుందన్నారు. వీరికి ఉగాది లోపు పోటీలు నిర్వహించి స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతులు అందచేస్తామని ముఖేష్ కుమార్ మీనా వివరించారు.