Chandrababu: మిగిలిన మూడు రోజులూ ఇదే స్ఫూర్తితో పాల్గొనాలి: సీఎం చంద్రబాబు పిలుపు
- జన్మభూమి-మా ఊరు, నీరు-ప్రగతిపై టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు
- సమాజంలో సంపద ఎంత ముఖ్యమో సఖ్యత కూడా అంతే ముఖ్యం
- సఖ్యతతో, సమష్టిగా కృషి చేస్తే సాధించలేనిది లేదు
- ప్రకృతితో మమేకం అయ్యేందుకే వనం-మనం, సూర్య ఆరాధన
సమాజంలో సంపద ఎంత ముఖ్యమో సఖ్యత కూడా అంతే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు విజయవాడలోని తన నివాసం నుంచి జన్మభూమి-మా ఊరు, నీరు-ప్రగతిపై టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడుతూ... సఖ్యతతో, సమష్టిగా కృషి చేస్తే సాధించలేనిది లేదని అన్నారు. ఉమ్మడి కుటుంబాల ప్రాధాన్యత గురించి చైతన్య పరచాలని, కలిసి ఉంటే కలిగే లబ్దిని ప్రజలకు వివరించాలని కోరారు. జన్మభూమి కార్యక్రమంలో మిగిలిన 3 రోజులూ ఇదే స్ఫూర్తితో పాల్గొనాలని చెప్పారు.
సమాజంలో సమూల మార్పులు తెచ్చే పవిత్ర యజ్ఞం జన్మభూమి అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. 7 రోజులు జన్మభూమి గ్రామసభలు ఉత్సాహంగా జరిగాయని, మిగిలిన 3 రోజులూ ఇదే స్ఫూర్తితో జన్మభూమిని విజయవంతం చేయాలని కోరారు. వ్యవసాయంపై మక్కువ పెంచేందుకే ఏరువాక వేడుకలు నిర్వహిస్తున్నామని, జలవనరుల ప్రాధాన్యత పెంచేందుకే జలసిరికి హారతి చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు.
ప్రకృతితో మమేకం అయ్యేందుకే వనం-మనం, సూర్య ఆరాధన కార్యక్రమాలను చేపట్టామని చంద్రబాబు అన్నారు. మన రాష్ట్రానికి ఉన్న సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరును సార్థకం చేసేందుకే సోలార్ విద్యుత్ ఉత్పాదనను పెద్ద ఎత్తున చేస్తున్నామన్నారు. 3వ విడత రుణమాఫీ ఈ 3 రోజుల్లో రైతులకు పూర్తిగా అందించాలని ఆదేశించారు.