High Court: కూతురు సంపాదిస్తున్నా.. ఆమె పెళ్లికి తండ్రి డబ్బులు ఇవ్వాల్సిందే: కేరళ హైకోర్టు కీలక తీర్పు
- కింది కోర్టు తీర్పును తప్పుబట్టిన హైకోర్టు
- తల్లీ, కుమార్తెకు ఆదాయ వనరులు ఉన్నప్పటికీ తండ్రి డబ్బులు చెల్లించాల్సిందే
- అక్రమ సంబంధాల ద్వారా పుట్టిన సంతానానికీ ఇది వర్తిస్తుందంటూ సంచలన తీర్పు
కుమార్తె సంపాదిస్తున్నప్పటికీ తన పెళ్లి కోసం తండ్రిని డబ్బులు డిమాండ్ చేయవచ్చని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. వివాహేతర సంబంధాల ద్వారా పుట్టిన సంతానానికి కూడా ఆ హక్కు ఉందని కోర్టు సంచలన తీర్పు చెప్పింది. భార్య, కుమార్తెకు అదనపు ఆదాయ వనరులు ఉన్నప్పటికీ వివాహం కోసం డబ్బులు కోరవచ్చని స్పష్టం చేసింది.
కోయంబత్తూరుకు చెందిన అంబిక అరవిందాక్షణ్ చేసిన అప్పీలుకు స్పందిస్తూ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. తన పెళ్లి ఖర్చులకు తండ్రి ముందుకు రావడం లేదని ఆరోపిస్తూ అంబిక పాలక్కాడ్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తండ్రి నుంచి రూ.5 లక్షలు ఇప్పించాల్సిందిగా కోరింది. అద్దెల ద్వారా వారికి నెలకు రూ.12వేల ఆదాయం వస్తుండడంతో తండ్రి నుంచి పెళ్లి ఖర్చులకు డబ్బులు అడగడం సరికాదంటూ ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పింది.
దీంతో అంబిక హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన కోర్టు పాలక్కాడ్ కుటుంబ న్యాయస్థానం తీర్పును తప్పుబట్టింది. వారికొచ్చే రూ.12 వేల ఆదాయాన్ని చూపించి కేసును కొట్టివేయడం సరికాదని పేర్కొంది. రూ.12వేలు మనిషి కనీస అవసరాలు తీర్చేందుకు కూడా సరిపోవంటూ 1987లో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది. తల్లీ, కుమార్తెకు అదనపు ఆదాయం ఉన్నప్పటికీ కుమార్తె పెళ్లి కోసం తండ్రి డబ్బులు చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది.