Hyderabad: లగ్జరీ ప్రాంతాల్లో ఐదో స్థానంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం.36
- మొదటి స్థానాల్లో ముంబయిలోని పోవాయ్, బ్రీచ్ క్యాండీ
- ఆ తరువాతి స్థానాల్లో ఢిల్లీలోని మెహర్చంద్ మార్కెట్
- బెంగళూరులోని ఇందిరానగర్, గుర్గావ్లోని గలేరియా మార్కెట్
హైదరాబాద్ మహానగరంలో జూబ్లీ హిల్స్ ఎంతగా అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలోనే గుర్తించదగ్గ ప్రాంతంగా నిలుస్తోంది. భారత్లోని మెట్రో నగరాల్లో హైఫై ప్రాంతాలను గుర్తించేందుకు అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ తాజాగా ఓ సర్వే నిర్వహించగా అందులో జూబ్లీహిల్స్ రోడ్ నెం.36 ఐదో స్థానంలో నిలిచింది. ఇక మొదటి స్థానాల్లో రెండు ప్రాంతాలకు చోటు లభించింది. అవి ముంబయిలోని పోవాయ్, బ్రీచ్ క్యాండీ. ఆ తరువాతి స్థానాల్లో ఢిల్లీలోని మెహర్చంద్ మార్కెట్, బెంగళూరులోని ఇందిరానగర్, గుర్గావ్లోని గలేరియా మార్కెట్ ఉన్నాయి.
ఆయా ప్రాంతాల్లో లగ్జరీ నివాసాలు, అతి పెద్ద షోరూమ్లు, ఆభరణాలు, బెంజ్కార్లు, ర్యాప్టర్ వంటి విదేశీ బైక్ షోరూమ్లు, బ్రాండెడ్ వస్తువుల వంటి పలు అంశాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం.36 ప్రాంతం దాదాపు ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ ఇండిపెండెంట్ ఇళ్లు కొనాలనుకుంటే కనీసం రూ.25 కోట్లు ఖర్చు చేయాల్సిందే. అలాగే ఒక్క ఫ్లాట్ అద్దె నెలకు రూ.లక్షకు పైనే ఉంటుంది. రాజకీయన నాయకులు, పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులు ఎక్కువగా ఇక్కడ వుంటారు.