britain: బ్రిటన్ ప్రధాని కీలక పాలనా బృందంలో నారాయణ మూర్తి అల్లుడు
- ట్వీట్ చేసిన బ్రిటన్ ప్రధాని కార్యాలయం
- అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా రిషి సునాక్ నియామకం
- స్థానిక ప్రభుత్వ మంత్రిత్వ శాఖలో బాధ్యతలు
ఆంతరంగిక మంత్రులు, కార్యదర్శుల బృందంలో చేసిన మార్పుల్లో భాగంగా బ్రిటన్ ప్రధాని థెరెసా మే, భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌కి కీలక శాఖను అప్పగించారు. రిషి సునాక్ స్వయానా ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి అల్లుడు. స్థానిక ప్రభుత్వం, కమ్యూనిటీస్, హౌసింగ్ మంత్రిత్వ శాఖలో అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా రిషి సునాక్‌ను నియమించినట్లు బ్రిటన్ ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.
ఈ మార్పుల్లో భాగంగా ఎక్కువ మంది మహిళలకు, వలసదారులకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. 2015 సాధారణ ఎన్నికల్లో నార్త్ యార్క్‌షైర్‌లోని రిచ్మండ్ నియోజకవర్గం నుంచి రిషి సునాక్ గెలిచారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, లండన్‌లోని ఓ ఇన్వెస్ట్మెంట్ సంస్థకు సహ-వ్యవస్థాపకుడిగా రిషి ఉన్నారు. 2014లో రాజకీయాల్లోకి వచ్చి, ఎంపీగా గెలుపొందారు. నారాయణ మూర్తి కూతురు అక్షత మూర్తిని రిషి పెళ్లి చేసుకున్నారు. వారికి కృష్ణా, అనౌష్క అనే ఇద్దరు పాపలు ఉన్నారు.