kcr: కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం.. ఐపీ అడ్రసులు ఇవ్వనంటున్న ‘ఫేస్ బుక్’!
- సీసీఎస్ పోలీసులకు తేల్చి చెప్పిన ‘ఫేస్ బుక్’ నిర్వాహకులు
- ఈ విషయమై కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు
- సీఐడీ ద్వారా ఎంహెచ్ ఏకు ఓ లేఖ రాసిన సీసీఎస్ పోలీసులు
ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఫేస్ బుక్’ సంస్థకు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ మొదలైంది. సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ‘ఫేస్ బుక్’ లో గతంలో కొందరు పోస్ట్ లు చేశారు.. అవి ఏ ఐపీ అడ్రసుల నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు విశ్వప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ విషయమై సాయపడాల్సిందిగా కోరుతూ ‘ఫేస్ బుక్’ నిర్వాహకులను సీసీఎస్ పోలీసులు కలిశారు.
అయితే, ఆ ఐపీ అడ్రసు వివరాలు వెల్లడించేది లేదని ‘ఫేస్ బుక్’ తేల్చి చెప్పింది. ఇది సాధారణ కేసులు లాంటిది కాదని, సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు అని పోలీసులు ఎంతగా చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఈ సంఘటనపై మండిపడుతున్న పోలీసులు ఈ విషయమై కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. సీఐడీ ద్వారా ఎంహెచ్ ఏకు ఓ లేఖ రాశారు.
కాగా, కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై చాదర్ ఘాట్ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసు సీసీఎస్ పోలీసులకు సంబంధించింది కావడంతో వీరికి బదిలీ అయింది. అప్పటి నుంచి కూడా ఈ కేసుపై విచారణ జరగుతోంది. ‘ఫేస్ బుక్’ నిర్వాహకులు సంబంధిత వ్యక్తుల ఐపీ అడ్రసులు ఇవ్వకపోవడంతో ఆ పోస్ట్ లు ఎవరు చేశారనే విషయం ఇప్పటివరకూ తేలలేదు. దీంతో, ఈ కేసు దర్యాప్తులో జాప్యం అవుతోంది.