narasimhan: మెట్టు దిగిన గవర్నర్.. ఏపీ నాలా బిల్లుకు ఆమోదం!
- నాలా బిల్లును ఆమోదించిన గవర్నర్
- తొలుత అభ్యంతరాలను వ్యక్తం చేసిన నరసింహన్
- ప్రభుత్వ వివరణతో సంతృప్తి
ఇరు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పట్టు వీడారు. ఏపీ కేబినెట్ పంపిన నాలా బిల్లుకు ఆమోదముద్ర వేశారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన ఆయన... చివరకు బిల్లును ఆమోదించారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే బిల్లు (నాలా)ను గవర్నర్ ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం పంపింది. అయితే, దీనిపై రాజముద్ర వేసేందుకు తొలుత నరసింహన్ నిరాకరించారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం పంపిన ఇలాంటి బిల్లుకే ఆయన ఆమోదముద్ర వేశారు. దీంతో, ఏపీ నేతలు ఆగ్రహానికి లోనయ్యారు. ఈ క్రమంలో గవర్నర్ కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య కొద్దిపాటి సంవాదం కూడా చోటు చేసుకుంది.
బిల్లుపై కొన్ని అభ్యంతరాలను లేవనెత్తిన గవర్నర్... తన అభ్యంతరాలకు బదులు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. దీంతో, గవర్నర్ అభ్యంతరాలకు వివరణ ఇవ్వాలంటూ రెవెన్యూ శాఖను సీఎం ఆదేశించారు. ఆ శాఖ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన నరసింహన్ ఎట్టకేలకు బిల్లుకు ఆమోదముద్ర వేశారు.