Telangana: దేవాదుల ప్రాజెక్టు పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: మంత్రి హరీశ్ రావు ఆదేశాలు
- గురువారం అర్ధరాత్రి వరకు దేవాదుల పనుల సమీక్ష
- ప్యాకేజ్ 2 పనులు వచ్చే జులై నాటికి, ప్యాకేజ్ 3 పనులు అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని డెడ్ లైన్
- నిర్ణీత గడువు లోగా పనులు పూర్తి చేయని ఏజెన్సీలను తప్పించాలని హరీశ్ ఆదేశాలు
దేవాదుల ప్రాజెక్టు పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. గురువారం అర్ధరాత్రి వరకు దేవాదుల పనులను ఆయన సమీక్షించారు. ముఖ్యంగా దేవాదుల 3వ ఫేజ్ కు చెందిన ప్యాకేజ్ 2,3,4ల పురోగతిని మైక్రో లెవెల్ లో సమీక్షించారు. ప్యాకేజ్ 2 పనులను వచ్చే జులై నాటికి, ప్యాకేజ్ 3 పనులను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని డెడ్ లైన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ప్యాకేజి 2 పనులలో పురోగతి ఆశాజనకంగా ఉన్నందున త్వరితగతిన పూర్తి చేస్తే రామప్పకు నీళ్ళందుతాయని, అక్కడి నుంచి ములుగు, ఘన పూర్, భూపాలపల్లి, పాకాల, ఎర్ర రంగయ్య చెరువులకు, ఆయా ప్రాంతాల ఆయకట్టుకు నీరందిస్తామని అన్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నిర్ణీత గడువు లోగా పనులు పూర్తి చేయని ఏజెన్సీలను తప్పించి వేరే వారికి ఆ పనులను అప్పగించాలని ఆదేశించారు.
ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసుకుని మూడు షిఫ్ట్ లు పని చేయాలని, భూ సేకరణ, సివిల్, మెకానికల్, టన్నెల్ తవ్వకాలు, లైనింగ్ పనులు ఏకకాలంలో సాగాలని కోరారు. పదిహేను రోజులకొకసారి దేవాదుల పనులను సమీక్షించి తనకు నివేదిక సమర్పించాలని ఈ సందర్భంగా తెలంగాణ లిఫ్ట్ పథకాల సలహాదారు పెంటారెడ్డిని ఆదేశించారు.
వచ్చే ఏప్రిల్ చివరి నాటికి విద్యుత్ సబ్ స్టేషన్లు, టవర్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని, పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికతో లక్ష్యం మేరకు పనిచేయాలని ఆదేశించారు. ములుగు ఘన్ పూర్ గ్రావిటీ కెనాల్ కు రెండు రోజుల్లో టెండర్లు పిలవాలని, ఇందుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వెంటనే ముగించాలని హరీశ్ రావు ఆదేశించారు. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు పసునూరి దయాకర్, సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.