terrorists: మూడు దశాబ్దాల క్రితం విమానాన్ని హైజాక్ చేసి.. నీర్జాతో పాటు 20 మందిని హత్య చేసిన ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
- సెప్టెంబరు 5, 1986న 379 మంది ప్రయాణికులతో వెళుతోన్న విమానం హైజాక్
- ప్రయాణికులను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన నీర్జా
- అప్పట్లో ఈ ఘటనలో మొత్తం 20 మంది మృతి
హైజాక్‌కు గురైన ఓ విమానంలో ప్రయాణికులను రక్షించే క్రమంలో తన ప్రాణాలు కోల్పోయిన భారత్‌కు చెందిన విమానయాన సిబ్బంది నీర్జా బానోత్ కేసులో నిందితుల ఫొటోలను ఈ రోజు అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ విడుదల చేసింది. వారి పేర్లు వదౌద్ మహ్మద్ హఫీజ్ అల్ తుర్కీ, జమల్ సయీద్ అబ్దుల్ రహీమ్, మహ్మద్ అబ్దుల్లా ఖలీల్ హుస్సేన్ అర్‌రహయ్యల్, మహ్మద్ అహ్మద్ అల్ మునావర్ గా ప్రకటించారు. దాదాపు ముప్పై ఏళ్ల క్రితం (సెప్టెంబరు 5, 1986న) 379 మంది ప్రయాణికులు, సిబ్బందితో ముంబయి నుంచి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ వెళ్తున్న పాన్ ఆమ్ విమానం పాకిస్థాన్‌లోని కరాచీలో హైజాక్‌కు గురైంది.
ఈ ఘటనలో విమాన సిబ్బందితో పాటు 20 మంది మృతి చెందారు. ఆ సమయంలో ప్రయాణికులను కాపాడేందుకు నీర్జా సాహసం చేసి ప్రాణాలు కోల్పోయింది. ఈ హైజాక్‌కు కారణమని అనుమానిస్తోన్న ఉగ్రవాదుల ఫొటోలను అమెరికా నిఘా సంస్థ 2000 సంవత్సరంలో సేకరించగా, ఇప్పుడు వాటిని వారి వయసుకు తగ్గట్టుగా ఏజ్ ప్రొగ్రేషన్ సాయంతో స్పష్టంగా కనిపించేట్లు మార్పులు చేశారు. ఒక్కో ఉగ్రవాది తలపై 5 మిలియన్ డాలర్ల రివార్డు ఉందని ఎఫ్‌బీఐ తెలిపింది.