Supreme Court: భారతావనిని నివ్వెర పరిచిన సుప్రీం న్యాయమూర్తుల ధిక్కారానికి కారణాలివి!
- భారతావనిని నివ్వెర పరిచిన న్యాయమూర్తుల తిరుగుబాటు
- స్వతంత్ర భారతావనిలో న్యాయమూర్తుల ప్రెస్ మీట్ తొలిసారి
- న్యాయమూర్తుల లంచాల కేసులో సీజే వైఖరిపై అసంతృప్తి
- లోయా అనుమానాస్పద మృతిపైనా అనుమానాలు
ఒకరు, ఇద్దరు కాదు. ఏకంగా నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భారతావనిని నివ్వెర పరిచారు. అత్యున్నత న్యాయస్థానంలో విధులు నిర్వహిస్తున్న జడ్జీలు జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ బీ లోకూర్, కురియన్ జోసెఫ్ లు నిన్న మీడియా ముందుకు వచ్చి, ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై సంచలన విమర్శలే చేశారు. స్వతంత్ర భారతావనిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇలా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి, ఈ విధంగా మాట్లాడటం ఇదే తొలిసారి. ఇక వారి తిరుగుబాటుకు కారణాలు ఏమై ఉంటాయని రాజకీయ, న్యాయ నిపుణులు విశ్లేషించారు.
గత సంవత్సరం అక్టోబర్ 27న 'లూథ్రా వర్సెస్ భారత ప్రభుత్వం' కేసులో వచ్చిన ఉత్తర్వులు ప్రధానమని తెలుస్తోంది. ఇదే సమయంలో నవంబర్ లో సుప్రీంకోర్టు విచారణకు వచ్చిన న్యాయమూర్తుల లంచాల కేసులో సైతం న్యాయమూర్తుల అభిప్రాయానికి, వచ్చిన తీర్పుకు వ్యత్యాసం ఉన్నట్టు సమాచారం.
సుప్రీంకోర్టులో జడ్జీల నియామకానికి సంబంధించి సవరించిన మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్ (ఎంఓపీ)ని పాటించకుండా నియామకాలు జరుగుతున్నాయని, న్యాయవాది ఆర్పీ లూథ్రా, ఓ పిటిషన్ వేయగా, ఈ కేసు పెను సంచలనాన్నే కలిగించింది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ లతో కూడిన ధర్మాసనం దీన్ని విచారణకు స్వీకరించి, కోర్టుకు హాజరు కావాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ కేసులో విచారణ ప్రారంభం కాకముందే కేసును జస్టిస్ మిశ్రా, ఏకే సిక్రీ, అమితావ్ రాయ్ లతో కూడిన ముగ్గురు జడ్జీల బెంచ్ కు బదిలీ చేస్తున్నట్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ప్రకటించారు. ఇది కేసును విచారిస్తున్న న్యాయమూర్తులకు అవమానం అనిపించింది.
ఇక మరో అవినీతి కేసులో సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వచ్చేలా చూస్తామని చెప్పి లంచాలు తీసుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసు కూడా, న్యాయమూర్తులకు, ప్రధాన న్యాయమూర్తికి మధ్య దూరం పెరగడానికి కారణమైంది.. ఈ కేసును ఐదుగురు సీనియర్ జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం విచారించాలని జాస్తి చలమేశ్వర్, ఎస్.అబ్దుల్ నజీర్ లతో కూడిన బెంచ్ నవంబర్ 9న ఆదేశించగా, ఆ మరుసటి రోజే సీజే దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తూ, తాను (భారత ప్రధాన న్యాయమూర్తి) కేసును ఎవరికైనా కేటాయిస్తే తప్ప మరే ఇతర న్యాయమూర్తి తనంతట తాను ఈ కేసులో విచారించలేడని స్పష్టం చేశారు. ఈ కేసులో పిటిషనర్ల తరఫున వాదన వినిపించిన ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్, దీన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడి, దీపక్ తో మందలింపులకు గురయ్యారు కూడా.
ఇక లక్నోకు చెందిన ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే మెడికల్ కాలేజీలో, కొత్త విద్యార్థుల ప్రవేశానికి సంబంధించిన కేసులో ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి ఇష్రత్ మస్రూర్ ఖుద్దూసీ నిందితుడు. ఈ కేసుతో పాటు, సొహ్రాబుద్దీన్ ఫేక్ ఎన్కౌంటర్ కేసును విచారించిన సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్ లోయా అనుమానాస్పద మృతి కూడా సుప్రీం జడ్జీల అసంతృప్తికి కారణమైంది. లోయా మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్ ను బొంబాయి హైకోర్టు విచారణకు స్వీకరించిన మరుసటి రోజే, సుప్రీంకోర్టు కల్పించుకుంది. న్యాయవాదుల అభ్యంతరాలనూ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఓ వైపు బొంబాయి హైకోర్టు లోయా మృతిపై విచారణ జరుపుతుండగా, సుప్రీంకోర్టు ఇలా వ్యవహరించడం, సీనియర్ జడ్జీల అధీనంలోని నాలుగు కోర్టులను కాదని సుప్రీంకోర్టులో విచారణ మొదలు పెట్టడం చలమేశ్వర్, రంజన్, లోకూర్, జోసఫ్ లకు ఆగ్రహాన్ని తెప్పించిందని, వారి తిరుగుబాటుకు ఈ కేసులన్నీ కారణాలేనని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.