Virat Kohli: ఎవరో చెప్పారని మేము జట్టును ఎంపిక చేయం: కోహ్లీ
- తొలి టెస్ట్ ఓటమి ప్రభావం మాపై లేదు
- స్థాయి మేరకు బ్యాట్స్ మెన్లు ఆడితే చాలు
- పొరపాట్లను పునరావృతం చేయవద్దు
దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ జరగనున్న తరుణంలో విరాట్ కోహ్లీ తనదైన శైలిలో స్పందించాడు. సెంచూరియన్ టెస్ట్ పై కేప్ టౌన్ టెస్ట్ ఓటమి ప్రభావం తమపై ఎంత మాత్రం ఉండదని విరాట్ స్పష్టం చేశాడు. తొలి టెస్ట్ కు ముందు తుది జట్టులో రహానే ఉండకూడదని అందరూ అన్నారని... వారం రోజుల్లోనే వారి అభిప్రాయాలన్నీ మారిపోయాయని, ఇప్పుడు రహానే ఉండాలని అంటున్నారని... ఎవరి అభిప్రాయాల మేరకో తాము జట్టును ఎంపిక చేయబోమని అన్నాడు. సెంచూరియన్ లో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. కేప్ టౌన్ లో తమ జట్టు ప్రదర్శన బాగానే ఉందని తెలిపాడు. ఆ టెస్ట్ నుంచి తాము ఎన్నో నేర్చుకున్నామని, రెండో టెస్టులో అది తమకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాడు. సెంచూరియన్ పిచ్ తమ సామర్థ్యాన్ని పరీక్షిస్తుందని... సత్తా చాటేందుకు తాము కూడా సిద్ధంగానే ఉన్నామని తెలిపాడు.
కేప్ టౌన్ లో మన బౌలర్ల ప్రదర్శన అద్భుతంగా ఉందని కోహ్లీ కితాబిచ్చాడు. సెంచూరియన్ లో కూడా వారు అదే స్థాయి ప్రదర్శన చేస్తారని భావిస్తున్నట్టు తెలిపాడు. బ్యాట్స్ మెన్లు మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని చెప్పాడు. కేప్ టౌన్ లో చేసిన పొరపాట్లను బ్యాట్స్ మెన్లు పునరావృతం చేయరాదని అన్నాడు. ఎంతో కాలంగా మనం మెరుగైన ఆటను ప్రదర్శిస్తున్నామని... విదేశాల్లో సైతం సత్తా చాటామని.. బ్యాట్స్ మెన్లు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పాడు. మన స్థాయి మేరకు ఆడితే చాలని అన్నాడు.