IPL: యువరాజ్, గంభీర్ ల కనీస ధర రూ. 2 కోట్లు మాత్రమే!
- 27 నుంచి ఐపీఎల్ 11వ సీజన్ వేలం
- వేలానికి ఓకే చెప్పిన 1,122 మంది ఆటగాళ్లు
- అశ్విన్, రహానే, గేల్, స్టోక్స్ పై అందరి కళ్లూ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదకొండో సీజన్ ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 1000 మందికి పైగా ఆటగాళ్లు వేలంలో పాల్గొనేందుకు అంగీకారం తెలుపగా, ఏ ఆటగాడి కనీస ధర ఎంత ఉంటుందన్న విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఐపీఎల్ 10వ సీజన్ లో వివిధ జట్ల తరఫున ఆడి, ఆపై వారు వదిలేసిన యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, హర్బజన్ సింగ్ వంటి ఆటగాళ్లతో పాటు, రవిచంద్రన్ అశ్విన్, అజింక్య రహానే, మిస్టరీ స్పిన్నర్ కులదీప్ యాదవ్, కేఎల్ రాహుల్, మురళీ విజయ్ వంటి ఆటగాళ్లకు ఎంత ధర పలుకుతుందన్న విషయమై ఉత్కంఠ నెలకొంది.
ఈ నెల 27, 28 తేదీల్లో మొత్తం 1,122 మంది ఆటగాళ్లను వేలం వేయనున్నారు. క్రిస్ గేల్, బెన్ స్టోక్స్ వంటి ఆటగాళ్లకు మంచి డిమాండ్ వస్తుందని, వారికి అధిక రేటు పలకవచ్చని ఫ్రాంచైజీలు అంచనా వేస్తున్నాయి. ఇక, రూ. 2 కోట్ల కనీస ధర జాబితాలో అశ్విన్, చాహల్, ధావన్, గంభీర్, కేదార్ జాదవ్, యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, పాట్ కుమిన్స్, హాజెల్ ఉడ్, మిచెల్ జాన్సన్, గ్లెన్ మాక్స్ వెల్, బెన్ స్టోక్స్, ఇయాన్ మోర్గాన్, మెక్ కల్లమ్, మ్యాథ్యూస్, బ్రావో, గేల్, పొలార్డ్ తదితర ఆటగాళ్లున్నారు.
రూ. 1.5 కోట్ల కనీస ధర జాబితాలో ఫించ్, అమిత్ మిశ్రా, డేవిడ్ మిల్లర్ ఈవెన్ ల్యూయిస్, హషీమ్ ఆమ్లా, జోయ్ రూట్, జాన్ బుట్లర్, కులదీప్ యాదవ్, మార్క్ ఉడ్, మోహిత్ శర్మ, మోయిన్ అలీ, నాథన్ లియాన్, షాన్ మార్ష్, ట్రెంట్ బౌల్ట్, వాషింగ్టన్ సుందర్ తదితర ఆటగాళ్లున్నారు. జంపా, బెన్ కట్టింగ్, బ్రాత్ వైట్, డేల్ స్టెయిన్, డ్వేనీ స్మిత్, మహమ్మద్ షమీ, ముస్తాఫిజుర్ రెహమాన్, పార్థివ్ పటేల్, పీయుష్ చావ్లా, సంజూ శామ్సన్, షకీబ్ అల్ హసన్, షేన్ వాట్సన్, టిమ్ సౌథీ, టామ్ కుర్రాన్, ఉమేష్ యాదవ్, సాహా తదితరులు రూ. కోటి జాబితాలో ఉన్నారు.