bahubali: ఆ అవార్డును ఆమే అందజేయాలని చెప్పా!: ‘కట్టప్ప’ సత్యరాజ్
- అనంత వికటన్ అవార్డు స్వీకరించిన సత్యరాజ్
- కులవివక్ష వ్యతిరేక కార్యకర్త కౌశల్య చేతుల మీదుగా అవార్డు
- ఆమె ద్వారానే ఆ అవార్డును ఎందుకు అందుకున్నారో చెప్పిన కట్టప్ప
‘బాహుబలి’ సినిమా తర్వాత నటుడు సత్యరాజ్ ఎంతో పాప్యులర్ అయ్యారు. సత్యరాజ్ గా కన్నా ‘కట్టప్ప’గా ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోయారు. ‘బాహుబలి’లో కట్టప్ప పాత్రకు గాను ఉత్తమ సహాయనటుడిగా ఐఫా అవార్డునూ ఈ మధ్య ఆయన అందుకున్నారు. తాజాగా ఇదే సినిమాకు గాను 'అనంత వికటన్' అవార్డును అందుకున్న సత్యరాజ్ గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పాలి.
చెన్నైలో నిన్న అనంత వికటన్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉత్తమ సహాయనటుడు (బాహుబలి) అవార్డును ఆయన అందుకున్నారు. అయితే, ఈ అవార్డును ఆయనకు అందజేసిన వ్యక్తి ఏ ప్రముఖ హీరోనో, నిర్మాతో లేక రాజకీయ నాయకుడో, నాయకురాలో కాదు. తనకు నచ్చిన వ్యక్తి చేతుల మీదుగానే ఆ అవార్డును సత్యరాజ్ అందుకున్నారు. కులవివక్ష వ్యతిరేక కార్యకర్త కౌశల్య శంకర్ చేతుల మీదుగా ఆ అవార్డును స్వీకరించారు.
ఈ విషయమై సత్యరాజ్ మాట్లాడుతూ, ‘నాకు అనంత వికటన్ అవార్డు వచ్చిందని నిర్వాహకులు ఫోన్ చేశారు. ‘ఈ అవార్డును ఏ నటుడి చేతుల మీదుగా తీసుకోవాలనుకుంటున్నారు?’ అని నిర్వాహకులు నన్ను అడిగారు. ‘కౌశల్య శంకర్ చేతుల మీదుగానే ఆ అవార్డు తీసుకుంటా’ అని చెప్పాను. ఎందుకంటే, మేము నటులుగా సామాజిక అంశాలపై సినిమాల్లో మాత్రమే పోరాడగలం. కానీ, కౌశల్యా శంకర్ లాంటి వ్యక్తి సమాజంలో నిజంగా పోరాడగలరు’ అన్నారు.
కాగా, కౌశల్యా గురించి చెప్పాలంటే.. శంకర్ అనే దళిత యువకుడిని ఆమె ప్రేమించి 2016లో పెళ్లి చేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్నావంటూ కౌశల్య తల్లిదండ్రులు కర్కశంగా వ్యవహరించారు. శంకర్ ను దారుణంగా హతమార్చారు. ఈ కేసులో కౌశల్య తండ్రితో పాటు మరో ఆరుగురికి మరణశిక్షను ఖరారు చేస్తూ తిరుపూర్ న్యాయస్థానం ఇటీవల తీర్పు ఇచ్చింది.