America: ఉద్యోగి పొరపాటు.. ప్రాణభయంతో పరుగులు తీసిన అమెరికన్లు!
- పొరపాటున హెచ్చరిక బటన్ నొక్కిన ఉద్యోగి
- నార్త్ కొరియా అణు క్షిపణి ప్రయోగించిందంటూ మెసేజ్లు
- 15 నిమిషాలపాటు గందరగోళం
ఓ ఉద్యోగి చేసిన చిన్న పొరపాటు ఏకంగా ఓ దీవిలోని ప్రజలను ప్రాణభయంతో పరుగులు పెట్టేలా చేసింది. జనాలందరూ పావుగంట పాటు ప్రాణభయంతో పరుగులు తీశారు. అమెరికాలోని ఓ ఉద్యోగి పొరపాటున ప్రజలను హెచ్చరించే ఓ తప్పుడు బటన్ నొక్కేశాడు. ఫలితంగా అమెరికా అధీనంలో ఉన్న దీవుల్లోని ప్రజలకు హెచ్చరిక మెసేజ్లు వెళ్లిపోయాయి. హవాయి దీవులే లక్ష్యంగా ఉత్తర కొరియా అణుక్షిపణిని ప్రయోగించిందని, వెంటనే అందరూ సేఫ్టీ షెల్టర్లలో తలదాచుకోవాలన్నది ఆ మెసేజ్ సారాంశం.
మెసేజ్లు చూసి భయభ్రాంతులకు గురైన ప్రజలు 15 నిమిషాల పాటు ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే తప్పిదాన్ని గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై మరో ప్రకటన చేశారు. మానవ తప్పిదం వల్ల ఆ మెసేజ్ వచ్చిందని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని పేర్కొనడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.