Narendra Modi: హైదరాబాద్ అశ్వకదళ పోరాటాన్ని గుర్తుకు తెచ్చుకున్న మోదీ, నెతన్యాహు

  • ఇజ్రాయెల్ లోని హైఫా నగరాన్ని ఆక్రమించుకున్న టర్క్ లు
  • టర్క్ లను ఓడించిన హైదరాబాద్, మైసూర్, జోధ్ పూర్ అశ్వ సేనలు
  • నాటి పోరాటాన్ని గుర్తుకు తెచ్చుకున్న ఇరువురు ప్రధానులు

వందేళ్లనాటి హైదరాబాద్ అశ్వకదళ పోరాట పటిమను భారత్, ఇజ్రాయెల్ ప్రధానులు మోదీ, బెంజమిన్ నెతన్యాహులు గుర్తుకు తెచ్చుకున్నారు. ఇజ్రాయెల్ లో మూడో అతి పెద్ద నగరమైన హైఫాను టర్క్ ల కబంధ హస్తాల నుంచి విముక్తి చేసిన గాథను మననం చేసుకున్నారు. 1918 సెప్టెంబర్ 23న బ్రిటీష్ ఇండియాలో భాగమైన హైదరాబాద్, మైసూర్, జోధ్ పూర్ అశ్వకదళాలు హైపాలో ఉన్న టర్క్ సైన్యంపై విరుచుకుపడ్డాయి. కేవలం కత్తులు, బల్లాలతోనే పోరాడి టర్క్ లను చిత్తుగా ఓడించాయి. ఈ క్రమంలో 44 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ విజయానికి గుర్తుగా బ్రిటీష్ ఇండియా సైన్యాధిపతి నివాసానికి ఎదురుగా స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఈ స్మారక చిహ్నం చూట్టూ బల్లాలను చేతపట్టి నిలబడ్డ ముగ్గురు సైనికుల విగ్రహాలను ఉంచారు. ఇవి యుద్ధంలో పాల్గొన్న మూడు ప్రాంతాలను సూచిస్తాయి. ఆ తర్వాత సైన్యాధికారి నివాసాన్ని తీన్ మూర్తి భవన్ గా, ఆ చౌరస్తాను తీన్ మూర్తి చౌక్ గా పిలవడం ప్రారంభించారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు తీన్ మూర్తి భవన్ లోనే వుండేవారు.

భారత పర్యటకు వచ్చిన నెతన్యాహు... మోదీతో కలసి తీన్ మూర్తి చౌక్ కు వచ్చారు. అక్కడ జరిగిన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, సైనికుల త్యాగాలు అనన్య సామాన్యమైనవని చెప్పారు. హైఫా నగరం స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవడానికి భారతీయ సైనికుల త్యాగాలే కారణమని తెలిపారు. హైఫా నగరానికి విముక్తి కలిగి వందేళ్లు పూర్తయిన సందర్భంగా తీన్ మూర్తి చౌక్ ను తీన్ మూర్తి-హైఫా చౌక్ గా మార్చారు.

  • Loading...

More Telugu News